భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనా చౌదరితో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చర్చలు జరిపారంటూ.. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు.. ఆ హోటల్ సీసీ టీవీ ఫుటేజీ సాక్ష్యంగా నిలిచింది. ప్రత్యేకంగా నిఘా విభాగం ద్వారా.. సుజనా చౌదరి కార్యాలయంపై నిఘా పెట్టి… ఆ దృశ్యాలను సేకరించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా.. ఆ ఫుటేజీలో సంచలనాత్మక విషయాలు వెల్లడయ్యాయని అంటున్నారు. అందులో వైసీపీకి షాకిచ్చేవి ఉన్నాయంటున్నారు. సుజనా చౌదరితో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భేటీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇది వైసీపీలో అంతర్గత కలకలకానికి కారణం అవుతోంది. ప్రత్యేకంగా ఇద్దరు సలహాదారులు… ఆ ఫుటేజీలో ఉన్న వారిని పిలిపించి… సుజనా చౌదరితో ఎందుకు సమావేశం కావాల్సి వచ్చిందో చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో కొత్త తలనొప్పులకు కారణం అవుతోంది. ఆయన రెబలిజం వెనుక భారతీయ జనతా పార్టీ ఉందని వైసీపీ అనుమానిస్తోంది. ఆయన విషయంలో ఎలాంటి ముందడుగు వేయాలో తెలియక తికమక పడుతోంది. నర్సాపురం ఎంపీ అసలు వ్యూహం ఏమిటో.. వైసీపీ పెద్దలకు అర్థం కావడం లేదు. ఈ క్రమంలో.. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సుజనా చౌదరితో టచ్‌లోకి వెళ్లారన్న సమాచారం.. వారిని కలవర పెడుతోంది. బయట జరుగుతున్న రాజకీయ ప్రచారానికి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పోలికలు ఉండటమే దీనికి కారణం. ఓ రెండు వారాల ఫుటేజీని పరిశీలిస్తేనే.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల దృశ్యాలు బయటపడ్డాయని.. ఇతర బీజేపీ నేతల్ని.. కీలక నేతల్ని ఇంకెంత మంది కలుస్తున్నారోనన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.
సుజనా చౌదరిపై నిఘా పెట్టారని క్లారిటీ రావడంతో.. భారతీయ జనతా పార్టీ నేతల్లోనూ అలజడి ప్రారంభమయింది. ఏపీ సర్కార్ తీరుపై.. కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రైవేటు హోటల్లో తన కార్యాలయంపై నిఘా పెట్టడం.. సీసీ టీవీ ఫుటేజీ బయటకు వెళ్లడంపై సుజనా చౌదరి కూడా సీరియస్‌గా ఉన్నారు. ఈ విషయంపై ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ పరిణామాలు.. మరింత వేగంగా.. రాజకీయాల్ని మార్చబోతున్నాయంటున్నారు.