మధుబాబు సృష్టించిన `షాడో` పాత్ర తెలుగు నాట సంచలనాలు సృష్టించింది. ఈపాత్ర చుట్టూ యాభైకి పైగా నవలలు రాసేశారాయన. ఇప్పుడవి తెరపైకి వస్తున్నాయి. ఓ వెబ్ సిరీస్ రూపంలో. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించనుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్టు పనుల్ని మధుబాబు ఇది వరకే మొదలెట్టేశారు. దర్శకత్వ బాధ్యతల్ని ప్రదీప్ చిలుకూరికి అప్పగించారు. రాజా చేయి వేస్తే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. ఆ సినిమా ఫ్లాప్. కానీ కుర్రాడిలో విషయం ఉందని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ గ్రహించింది. అందుకే ఈ సిరీస్ బాధ్యత ఆయనపై పడింది.
ప్రస్తుతం షాడో పాత్రకు తగిన నటుడి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ పాత్రలో గోపీచంద్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అడవిశేష్, విశ్వక్ సేన్… వీళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పారితోషికం, కాల్షీట్లు సర్దుబాటు అయ్యాక.. ఫైనల్ షాడో ఎవరన్నది తేలుస్తారు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో షాడోని చూపించే ఆలోచనా ఉంది. అయితే షాడో పాత్రకి ఓ ఇమేజ్ అవసరం. ఆ ఇమేజ్ చివరి ఎపిసోడ్ వరకూ కొనసాగాలంటే… ఒకే నటుడితో షాడో వెబ్ సిరీస్ పూర్తి చేయాలి. ఈ వెబ్ సిరీస్‌ని అన్ని భాషల్లోనూ తీసుకెళ్లే ఆలోచన ఉంది. అలా జరగాలంటే సౌత్ ఇండియా మొత్తానికి తెలిసిన నటుడైతే బాగుంటుంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించి, షాడోని ఎంపిక చేసుకోవాలని ఇప్పుడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ భావిస్తోంది.