అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్’కి సరైన రిజల్ట్ రాలేదు. భారీ రేటుకి ఈసినిమా కొన్న అమేజాన్, డబ్బులు బాగా ఖర్చు పెట్టి ప్రచారం కూడా చేసింది. కానీ… గిట్టుబాటు కాలేదు. ‘పెంగ్విన్’ ప్రతికూల ఫలితం ఓటీటీపై ఆశలు పెట్టుకున్న చాలా సినిమాలకు, వాటి ఆశలకు కళ్లెం వేసినట్టైంది. అంతెందుకు…? కీర్తి నటించిన రెండు సినిమాల్ని సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది.
కీర్తి నటించిన ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖీ’ ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యాయి. థియేటర్లు ఓపెన్ కాని పక్షంలో ఓటీటీలోనే నేరుగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ‘పెంగ్విన్’కి మంచి రేటు దక్కడం ఆయా నిర్మాతలకు భరోసా కలిగించాయి. ‘పెంగ్విన్’ గనుక హిట్టయితే.. తమ సినిమాలకు మరింత మంచి రేటు వస్తుందని భావించారు. కానీ… `పెంగ్విన్`కి నెగిటీవ్ టాక్ రావడం, పెట్టిన పెట్టుబడికీ, వ్యూవర్ షిప్కీ పొంతన లేకపోవడం నిరాశ కలిగించాయి. అలా…. ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖీ’ల ఓటీటీ ఆశలపై ‘పెంగ్విన్’ నీళ్లు చల్లినట్టైంది.
కమర్షియల్ సినిమాలు ఫ్లాప్ అయినా, కథానాయికలపై పెద్ద భారం పడదు. కానీ సోలో సినిమాలు అలా కాదు. కథానాయికల డౌన్ ఫాల్‌కి ఒక్క ఫ్లాప్ చాలు. అదే కీర్తి భయం కూడా. ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖీ’ చిత్రాల్లో ఒక్క హిట్టు కొట్టినా, కీర్తి ఫామ్ కంటిన్యూ అవుతుంది. లేదంటే మాత్రం – కథల ఎంపిక విషయంలోనూ, జోనర్ల విషయంలో… కీర్తి మరోసారి పునరాలోచించాల్సిందే.