నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. మధ్యలో హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డితోనూ సమావేశమయ్యారు. ఇంకా పలువురు మంత్రులతోనూ భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. కరోనా కాలంలో ఓ మంత్రి అపాయింట్మెంట్ దొరకడమే గగనం అనుకున్న పరిస్థితుల్లో…ఇలా ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణంరాజు అలా బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. అదే సమయంలో.. తాను రేపిన వివాదానికి.. తన ఢిల్లీ పర్యటనకు సంబంధం లేదన్నట్లుగా మీడియాతో మాట్లాడుతున్నారు. పార్టీని, ముఖ్యమంత్రిని, ఎప్పుడూ వ్యతిరేకించలేదు, వ్యతిరేకించనని మీడియాకు స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ఒకట్రెండు అంశాల్లో సూచనలు మాత్రమే చేశానన్నారు. సీఎంను కలిసే అవకాశం వస్తుందని అనుకోవడంలేదని.. అయినా సీఎం అపాయింట్మెంట్ అడిగానని.. ఇస్తే వెళ్లి కలుస్తానని ప్రకటించారు. తనకు పార్టీ అధ్యక్షుడికి మధ్య దూరం పెంచేందుకు యత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని .. కేంద్రబలగాలతో రక్షణ కల్పించాలని కిషన్‌రెడ్డిని కలిసి విన్నవించానని చెప్పారు. ఇతర నేతల్ని మర్యాద పూర్వకంగానే కలిసినట్లు చెబుతున్నారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు విషయంలో… రఘురామకృష్ణంరాజు.. సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
సీఎంకు ఇవ్వాల్సిన సమాధానంపై నిపుణుల సూచనలు తీసుకుంటున్నానని.. రాజ్యాంగబద్ధ చర్చలో పాల్గొన్న తనకు షోకాజు నోటీసులు సరికాదని అంటున్నారు. షోకాజు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోకాజు నోటీసులో ఉన్న అన్ని అంశాలపై వివరణ ఇస్తానని.. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధంలేదని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. ఆయన వెనక్కి తగ్గినట్లుగా మాట్లాడుతున్నారు కానీ.. పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారని.. ఆయన శైలి రాజకీయాన్ని విశ్లేషిస్తున్న వారు చెబుతున్నారు.