కాస్ట్ కటింగ్ గురించి నిర్మాతలతు తర్జన భర్జనలు పడుతున్నారు. ఖర్చు ఎలా తగ్గించాలి? బడ్జెట్ ఎలా కంట్రోల్ లో ఉంచాలి? అనేది ప్రధాన అజెండాగా మారింది. ఇప్పటికే బడ్జెట్లు ఖరారైన చిత్రాల ఖర్చునీ అదుపులో ఉంచుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈలోగా హీరోలు సైతం `కాస్ట్ కటింగ్` మంత్ర మొదలెట్టారు.
ప్రతీ హీరో దగ్గర కనీసం ఆరు నుంచి ఎనిమిది మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటుంది. వీళ్లకు నెలసరి జీత భత్యాలు చెల్లించాల్సివుంది. సినిమాలు సెట్ లో ఉన్నప్పుడు… నిర్మాతలే వీళ్ల జీతాల్ని భరిస్తుంటారు. కొంతమంది చేతిలో సినిమాల్లేకపోయినా, సిబ్బంది విషయంలో మాత్రం రాజీ పడేవారు కాదు. అయితే ఇప్పుడు వాళ్లలో మార్పు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా షూటింగులు ఆగిపోయాయి. దాంతో.. హీరోలకే పనిలేకుండాపోయింది. ఇక సిబ్బంది ఎందుకు? అందుకే సహాయక సిబ్బంది ఇంటికే పరిమితం అవుతున్నారు. కొంతమంది హీరోలు… సగం సిబ్బందిని తొలగించినట్టు తెలుస్తోంది. వాళ్లకు రెండు నెలల ముందుస్తు జీతాలు చెల్లించి `ఇక రావొద్దు` అని గౌరవంగా పంపేశార్ట.
ఇండ్రస్ట్రీలో ఓ టాప్ హీరో, సినిమాకి 30 నుంచి 40 కోట్ల వరకూ తీసుకునే కథానాయకుడు సైతం ఇటీవల కొంతమంది సిబ్బందికి ఉద్వాసన పలికినట్టు టాక్. `షూటింగ్ మొదలైతే అప్పుడు పిలుస్తాం` అని చెప్పి పంపించేస్తున్నార్ట. ప్రతీ హీరోకీ వ్యక్తిగత కార్యాలయాలు ఉన్నాయి. వాటి నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. కొంతకాలంగా ఆఫీసులకు తాళాలు వేసేశారు. ఆ రకంగానూ… ఖర్చు ని అదుపులో ఉంచుకుంటున్నారు. మళ్లీ సినిమాలు మొదలైతే గానీ ఆఫీసులు కళకళలాడవు. ఉద్వాసనకు గురైన సిబ్బందికి పని దొరకదు.