అభిమన్యుడుతో ఓ హిట్టు కొట్టాడు విశాల్. ఇప్పుడు ‘చక్ర’గా రాబోతున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. ఆనందన్ దర్శకుడు. ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
సైబర్ నేరాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఆగస్టు 15న హైదరాబాద్ లో ఒకేసారి 48 దొంగతనాలు జరుగుతుతాయి. ఓ చోట అయితే… పరమవీర చక్ర మెడల్ ని దొంగిలిస్తాడు ఓ అగంతకుడు. అతన్ని వెదికి పట్టుకోవడానికి ఓ మిలటరీ ఆఫీసర్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు.. తెర రూపం చక్ర.
ఒక దేశాన్ని బెదిరించే తీవ్రవాదుల యాక్టివిటీస్‌ని గమనించడానికి ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసే రీసర్చ్ కంటే, ఓ సగటు మనిషి అవసరాలు, వాడి ఆశలు తెలుసుకోవడం కోసం ఓ కార్పోరేట్ కంపెనీ చేసే రీసర్చే ఎక్కువ…
కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్లెస్ నెట్వర్క్ కూడా ప్రమాదకరమే..
– ఇలాంటి డైలాగులు సినిమా నేపథ్యాన్ని చెప్పకనే చెబుతాయి. డిజిటల్ ఇండియా అనే కాన్సెప్టుని ఈసినిమాలో బాగా వాడుకున్నట్టు అర్థం అవుతోంది. ట్రైలర్‌ని కట్ చేసిన విధానం, విజువల్స్… ఇవన్నీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విశాల్ సినిమా అంటేనే యాక్షన్ ఫీస్ట్. ఈసారీ ఈ సినిమాని అలానే తీర్చిదిద్దారు. అయితే.. గతంలో అభిమన్యుడులోనూ ఇలాంటి సైబర్ నేరాల గురించే చర్చించారు. ఈసారీ అంతే. అందులోనూ విశాల్ మిలటరీ ఆఫీసర్‌గానే కనిపించాడు. ఈసారీ కూడా తన పాత్ర అదే. ఓ రకంగా ఇది అభిమన్యుడు కి సీక్వెల్ లాంటిదన్నమాట. శ్రద్ధా శ్రీనాథ్‌కి సీరియస్ రోల్ దక్కినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. విలన్ ఎవరన్నది చూపించలేదు. ముసుగుతోనే మానేజ్ చేశారు. బహుశా… ఈ సినిమాలో అదే అతి పెద్ద ట్విస్ట్ కావొచ్చు.