కేంద్ర ప్రభుత్వం తమకు యూనిట్‌కు రూ. రెండు రూపాయలు కరెంట్ అమ్మడం.. దాన్ని తాము మళ్లీ రూ. తొమ్మిది రూపాయలకు ప్రజలకు అమ్మడం అంతా అబద్దమని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ విమర్శలపై కల్లా అజేయరెడ్డి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టారు. విద్యుత్‌పై నిర్మల వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని.. ఏపీలో ఇండస్ట్రియల్ విద్యుత్ టారిఫ్ రూ.7.65 మాత్రమేనని స్పష్టం చేశారు. 2017లో ఉన్న టారిఫ్‌నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని.. నిర్మల చెబుతున్న రూ.9 ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదని చెప్పుకొచ్చారు. రూ.2.75 కి విద్యుత్‌ను ఎక్కడ ఇస్తున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో పవర్ సెక్టార్‌పై నిర్మలా సీతారామన్‌కు సరైన సమాచారం లేదని .. విద్యుత్ అప్పు రూ.70 వేల కోట్లు ఉందని చెప్పుకొచ్చారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదు.. విద్యుత్ రంగాన్ని కేంద్రం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. విద్యుత్ సంస్థల అప్పుల పాపం మాది కాదని ప్రకటించారు.
ఇక రివర్స్ టెండర్ల గురించి.. ఆదా గురించి.. అవినీతి నిర్మూలన గురించి చెప్పేవి కూడా.. కల్లాం అజేయరెడ్డి చెప్పినా.. నిర్మలా సీతారామన్ అబద్దాలు చెబుతున్నారని చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వర్చవల్ ర్యాలీలో తీవ్రమైన ఆరోపణలు చేసిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పై వైసీపీ రాజకీయంగా ఎదురుదాడి చేయలేకపోయింది. మామూలుగా అయితే.. రాజకీయ విమర్శలకు రాజకీయ నేతలు ప్రెస్మీట్లు వివరణ ఇవ్వడమో.. ఎదురుదాడి చేయడమో.. ప్రతి ఆరోపణలు చేయడమో చేసేవారు. వైసీపీ వ్యూహంలో అయితే ఇది మరింత ఘాటుగా ఉంటుంది. చంద్రబాబు అయినా.. పవన్ కల్యాణ్ అయినా.. లోకేష్ అయినా.. క్షణాల్లోనే వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. బూతులు మాట్లాడుతున్నామా.. మంచి భాష మాట్లాడుతున్నామా అనేది చూసుకోకుండా విరుచుకుపడేవారు.
కానీ బీజేపీ అనే సరికి.. వైసీపీ తరపున ఒక్కరంటే.. ఒక్క రాజకీయ నేత కూడా తెరపైకి రాలేదు. వైసీపీ హైకమాండ్ కూడా.. నిర్మలా సీతారామన్ పై రాజకీయ విమర్శలు వద్దనుకుని… అందరికీ ఆ మేరకు సందేశం పంపినట్లుగా తెలుస్తోంది. అయితే నిర్మలా సీతారామన్ రాజకీయంగా చేసే విమర్శలకు కల్లాం అజేయరెడ్డి ఇచ్చిన కౌంటర్ ఇలా సరిపోతుందన్న చర్చ వైసీపీలోనే జరుగుతోంది. బీజేపీ పెద్దలపై విమర్శలు చేయాలంటే.. వైసీపీ నేతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎవరిపైనైనా విమర్శలు చేస్తే.. టీడీపీతో లింక్ పెట్టి చేస్తారు. బీజేపీ పెద్దలకు దగ్గరైన వారిపై మాత్రం.. నోరు మెదపరు.