జనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా “కాపు” అంశంపై దృష్టి సారించారు. నిన్నటికి నిన్న కాపు కార్పొరేషన్ నిధులపై కాకి లెక్కలు చెబుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన.. వైసీపీ వైపు నుంచి రియాక్షన్ రాగానే.. తన విమర్శల్లో ఘాటు పెంచారు. ఈ సారి ఏకంగా రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఇప్పటి వరకూ .. ఎప్పుడూ నేరుగా ఈ అంశంపై మద్దతివ్వని పవన్ కల్యాణ్ ఒక్క సారిగా.. తానే కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుని అవతారం ఎత్తేశారు. ఘటుగా ఓ లేఖ మీడియాకు విడుదల చేశారు.
కాపు రిజర్వేషన్.. కోట్లాది మంది కోరిక అని.. మొదట్లో బీసీలుగా ఉన్న కాపులను నీలం సంజీవ రెడ్డి ఓసీల్లో చేర్చారు. అప్పట్నుంచి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. మధ్యలో దామోదరం సంజీవయ్య 1961లో కాపులను మళ్లీ బీసీల్లో చేరిస్తే.. కాసు బ్రహ్మానంద రెడ్డి తీసేశారన్నారు. అంటే పవన్ కల్యాణ్.. ఇక్కడ రెడ్డి సామాజికవర్గ ముఖ్యమంత్రులు కాపుల్ని మోసం చేశారని చెప్పదల్చుకున్నారమాట. 56 ఏళ్లుగా కాపుల పట్ల కపట ప్రేమను నటిస్తూ ఓట్లు దండుకుంటున్నారని పరోక్షంగా రెడ్డి నాయకులపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు రిజర్వేషన్లు ఇస్తానన్న విధానాన్ని కూడా తప్పు పట్టిన పవన్ కల్యాణ్.. బి.సి.కోటా లో కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను జగన్ రద్దు చేయడంపై విరుచుపడ్డారు. 2014 ఎన్నికల సమయం నుంచి పాదయాత్ర వరకు కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. లేఖలో చాలా సూటిగా పవన్ కల్యాణ్ … కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
హఠాత్తుగా పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ బాధ్యతను ముద్రగడ పద్మనాభం తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంటయిపోయారు. కొత్త ప్రభుత్వం రాగానే.. ఐదు శాతం రిజర్వేషన్లను తొలగించినా.. ఒక్క కాపు నేత కూడా నోరెత్తలేకపోయారు. ఏడాది తర్వాత పవన్ కల్యాణ్ తెరపైకి వచ్చారు. రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తుతున్నారు.
పవన్ కల్యాణ్ కాపు అంశాన్ని మాట్లాడాలంటే.. అంతకు ముందు తటపటాయించేవారు. దానికి కారణం తనపై కుల ముద్ర వేస్తారనే కావొచ్చు. ఆ పద్దతి వల్ల.. తనకు అండగాఉండాల్సిన సామాజికవర్గం.. పూర్తి స్థాయిలో అండగా నిలబడలేదు. ఆయనకు ఎదురైన చేదు ఫలితాలే దీనికి నిదర్శనం. ఈ తప్పును దిద్దుకోవాలంటే.. తన వర్గాన్నైనా తనకు గట్టి సపోర్ట్‌గా ఉండేలా చూసుకోవాలని ఆయన తపన పడుతున్నట్లుగా కనిపిస్తోదంి. అందుకే కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లుగా భావిస్తున్నారు.