ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాలని జగన్ సర్కార్ పట్టుదలగా ఉంది. నిధుల అడ్డంకులు ఉన్నా.. కరోనా విజృంభిస్తున్నా… ప్రభుత్వం మాత్రం పనుల విషయంలో రాజీ పడటం లేదు. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి వివిధ సౌకర్యాల కల్పనకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఆ టెండర్లపై మళ్లీ రివర్స్ టెండర్లకు వెళ్లారు. ప్రభుత్వానికి రూ.143 కోట్లు ఆదా అయ్యాయి. మొదటి విడత నాడు-నేడు భాగంగా 15 వేలకుపైగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం రూ.710 కోట్లు రివాల్వింగ్ ఫండ్ కేటాయించారు. ఇప్పటివరకు రూ.504 కోట్లు పెట్టారు. ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రధానంగా తొమ్మిది సౌకర్యాలను ప్రభుత్వ పాఠశాలకు నాడు-నేడు ద్వారా కల్పిస్తున్నారు. నీటి వసతి సహా మరుగుదొడ్లు, మేజర్, మైనర్ మరమ్మతులు, సురక్షిత మంచినీటి వసతి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సామగ్రి, ప్రతి తరగతి గదిలో గ్రీన్ చాక్బోర్డు, ప్రతి తరగతి గదిలో పంకా, ట్యూబ్‌లైట్, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లిష్ ల్యాబ్, పాఠశాలలకు రంగులు., పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపడుతున్నారు. దశలవారీగా 44వేల స్కూళ్లకు ఈ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ స్కూళ్లు అంటే.. మౌలిక సదుపాయాలు ఉండవని అనుకుంటారు. కానీ ఆ పరిస్థితిని మార్చి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది.
ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంను.. అన్ని స్కూళ్లలో నిర్బంధం చేయాలన్న పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఉంది. న్యాయపరంగా కొన్ని చిక్కులు వస్తున్నా.. ఎలాగోలా అధిగమించి.. తెలుగు మీడియం లేకుండా చేయాలని… ఒక్క ఇంగ్లిష్‌లోనే బోధన చేయాలని పట్టుదలను ప్రదర్శిస్తోంది. దానికి తగ్గట్లుగా ఇప్పుడు స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించే విషయంలోనూ.. రాజీ పడకుండా.. వ్యవహరిస్తోంది. దీంతో.. ప్రభుత్వ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.