మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. మరణించిన చాలా రోజులకు ఆయన గొప్ప తనాన్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి. ఆయన పచ్చి కాంగ్రెస్ వాది అయినా… కాంగ్రెస్ పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా.. ఆయన గొప్ప తనాన్ని కీర్తిస్తున్నాయి. ఈ జాబితాలో భారతీయ జనతా పార్టీ కూడా ఉండటము కాస్త ఆశ్చర్యకరమైన అంశమే. అన్ని పార్టీలు.. ఆయనకు భారతరత్న ఇవ్వడమే సముచితంగా గౌరవించినట్లు అని ప్రకటించేశాయి. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సమైక్యవాది అయిన పీవీకి ప్రత్యేక తెలంగాణలో అమితమైన గౌరవం దక్కేలా చూస్తున్నారు కేసీఆర్. ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టకపోయినప్పటికీ.. ట్విట్టర్ ద్వారా పీవీకి నివాళులర్పించారు. చంద్రబాబునాయుడు కూడా.. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలోనే తాము తీర్మానం చేశామన్న సంగతిని గుర్తు చేశారు.
ఇంత కాలం పీవీ నరసింహారావును.. ఇతర పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోలేదు. పీవీ నరసింహారావుకు పేరు రావడం సోనియా గాంధీకి ఇష్టం లేదని ఆ పార్టీలో ప్రచారం ఉంది. అందుకే.. ఆయనను ఎవరూ కాంగ్రెస్‌లో ఓన్ చేసుకోలేరు. ఈ పరిస్థితిని కేసీఆర్ అనుకూలంగా మల్చుకోవాలనుకున్నారో.. నిజంగానే పీవీపై అభిమానం ఉందో కానీ.. ఆయన పీవీని ఎవరూ గౌరవించని విధంగా ప్రభుత్వం తరపున గౌరవించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న హడావుడి చూసి.. కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. పీవీ తమ పార్టీ వాడే అని చెప్పుకోవడానికి హడావుడిగా కొన్ని కార్యక్రమాలతో పాటు.. ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నడిమాండ్ ను కూడా వినిపించడం ప్రారంభించారు. పార్లమెంట్లో స్వయంగా ఈ డిమాండ్ ను వినిపిస్తానని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పీవీకి నివాళి అర్పించడం ఈ సారి కొత్త అంశం. నిజానికి బీజేపీ కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన దిగ్గజ నేతలను.. గొప్పగా ప్రచారం చేస్తూ.. వారికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇష్యూనే దానికి సాక్ష్యం. పక్కా కాంగ్రెస్ వాది.. ఆరెస్సెస్ అంటే తీవ్ర వ్యతిేరకత చూపే పటేల్‌ను.. బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేసుకుంది. తమ పార్టీ వాడే అన్నట్లుగా ఆ ప్రచారం ఉంది. ఇప్పుడు పీవీ నరిసంహారావు విషయంలోనూ.. దక్షిణాదిలో అలాగే చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు కాకపోయినా.. ఎన్నికలకు ముందు ఈ సెంటిమెంట్ ఇంతే పెరిగితే.. లేదా.. వచ్చే ఏడాది.. శత జయంతి ఉత్సవాలకైనా భారతరత్న ప్రకటించేసి.. క్రెడిట్ పొందినా ఆశ్చర్యం లేదన్న భావన ఉంది. అదే చేస్తే కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే.