కాపు రిజర్వేషన్ల అంశాన్ని పవన్ కల్యాణ్ ఎజెండాగా మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గం నేతలు కాపులకు చేసిన అన్యాయం గురించి పవన్ కల్యాణ్ చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. వైసీపీ అధికారంలోకి రాగానే … చంద్రబాబు ఇచ్చిన ఐదు శాతం కాపు రిజర్వేషన్లు రద్దు చేయడం దగ్గర్నుంచి కాపు కార్పొరేషన్ కింద కాకి లెక్కలు చెప్పడం వరకూ.. అన్నీ.. ప్రముఖంగా కాపు వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పథకాలు అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు కనీ.. తమ వరకూరాకపోవడం ఏమిటన్న అసంతృప్తి ఆ వర్గంలో ఉంది..దానికి తాజాగా రిజర్వేషన్ల రద్దు అంశం తోడయింది. పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడిన విధానం… చర్చనీయాంశం కావడంతో.. వైసీపీ నేతల్లోనూ అలజడి ప్రారంభమయింది.
కాపు రిజర్వేషన్లు అడిగితే పవన్‌పై రోజంతా ఎటాక్.!
పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తే.. వైసీపీలోని అగ్రనాయకత్వం ..కాపు వర్గానికే చెందిన నేతలను రెడీ చేసి వదులుతుంది. ఇంత కాలం.. ఏ పదవి.. ఏ పనీ ఇవ్వకుండా.. కనీసం గౌరవించని కాపు నేతలను కూడా.. పిలిపించి ప్రెస్మీట్లు పెట్టిస్తుంది. కరణం బలరాంను టీడీపీలో చేర్చుకుని ఆమంచి కృష్ణమోహన్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానిస్తున్న వైసీపీ పెద్దలు.. పవన్ కల్యాణ్ ను తిట్టడానికి మాత్రం ఆయనకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే.. నిన్నామొన్నటిదాకా టీడీపీలో ఉండి.. వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. కానీ పవన్ కల్యాణ్ కాపు వాయిస్ వినిపించేసరి.. తెరపైకి వచ్చారు. ఇక పీఆర్పీ నుంచి రాజకీయ జీవితం పొంది.. ఇప్పుడు మంత్రిగా చెలామణి అవుతున్న కన్నబాబు లాంటి వాళ్లు.. పవన్ కల్యాణ్ పై చేసే విమర్శలు ఓ రేంజ్లో ఉండవు. అందరూ పవన్ పై విరుచుకుపడేవారే.
కాపు నేతలతో కాపుల కళ్లు పొడిచేస్తున్నారా..?
వైసీపీలో ఉన్న కాపు నేతలకు.. ఎక్కడా పెద్దగా ప్రాధాన్యం దక్కుతున్నట్లుగా కనిపించడం లేదు. కేవలం పవన్ కల్యాణ్‌ను ఎవరు అసభ్యంగా తిడతారో.. వారికి మాత్రమే పదవులు లభిస్తున్నాయి. పేర్ని నానికి మంత్రి పదవి వచ్చింది.. పవన్ కల్యాణ్‌పై దారుణంగా విరుచుకుపడటం వల్లనేనని ఇప్పటికే ప్రచారం ఉంది . ఆ తర్వాత పలువురు కాపు నేతలు.. ఈ విషయం పోటీ పడి పవన్ ను తిడుతున్నారు. పవన్ తిట్టిన వారికి ప్రాధాన్యం లభిస్తుందన్న సంకేతాలు వెళ్లడంతో… వైసీపీ హకమాండ్ చెప్పినట్లు తిట్టేందుకు కొంత మంది నేతలు రెడీ అవుతున్నారు.
కాపుల కోసం పవన్‌ను నోరెత్తనీయకుండా చేయడమే లక్ష్యమా..?
పార్టీలో ప్రాధాన్యమో.. పదవుల ఆశో.. మరో ప్రయోజనమో ఆశ చూపి.. కాపుల ప్రయోజనాలు.. వారికి ఇచ్చిన హామీలను మలు చేయమని అడుగుతున్న పవన్ కల్యాణ్‌పై కాపునేతల్ని ఎగదోస్తోంది అధికార పార్టీల. పవన్ కల్యాణ్ ఆ వర్గం విస్తృత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. కానీ వైసీపీలోని కాపు నేతలు.. తమ వ్యక్తిగత స్వార్థం కోసం.. ఆ పోరాటంపై విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ వర్గాల్లోనే అసంతృప్తి పెరిగిపోతోంది. మాట్లాడితే.. టీడీపీ హయాంలో కాపులకు అన్యాయం జరిగితే మాట్లాడలేదని పవన్ పై విరుచుకుపడుతారు కానీ.. ఇప్పుడు అంతకు మించి అన్యాయం జరుగుతున్నా.. వారు నోరెత్తరు.. నోరెత్తేవారిని మూయడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.