నంద్యాలలో ఎస్పీవై రెడ్డికి చెందిన కెమికల్ పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో.. జనరల్ మేనేజర్ స్థాయి ఉద్యోగి చనిపోయారు. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఆ పరిశ్రమ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని.. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని.. తేలింది. కంపెనీపై ఏం చర్యలు తీసుకుంటారోనన్నది తర్వాతి విషయం బాధితులకు సాయం విషయంలో మాత్రం చాలా మంది.. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ అంశాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్.. అక్కడ చనిపోయిన వారికి కోటి ప్రకటింటడమే కాదు.. వెంటిలేటర్లపై ఉన్న వారితో సహా .. చుట్టుపక్కల గ్రామాల వారందరికీ ప్యాకేజీ ప్రకటించారు. దాంతో.. నంద్యాల కెమికల్ లీకేజీ బాధితులు కూడా అదే ఆశించారు. అయితే.. అటు ప్రభుత్వం తరపు నుంచి కానీ.. ఇటు యాజమాన్యం నుంచి కానీ.. బాధితులకు కనీస పరామర్శ కూడా కరవయింది.
కెమికల్ కంపెనీ వ్యవహారాలను చూసుకునే జనరల్ మేనేజర్ స్థాయి అధికారి… చనిపోతే.. పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దాంతో వారి కుటంబసభ్యులు మృతదేహంతో ధర్నా చేయాల్సి వచ్చింది. కంపెనీ కూడా.. నష్ట పరిహారం విషయాన్ని మాట్లాడలేదు. రూ. 30 లక్షలు ఇస్తామని అదీ కూడా వాయిదా పద్దతిలో ఇస్తామని ఇంత కంటే చేయగిలిగిందేమీ లేదని.. మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోవాలని కంపెనీ యాజమాన్యం బెదిరించింది. దాంతో వారు.. మృతదేహంతో ధర్నా చేయడంతో… ఎస్పీవై కంపెనీ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి వచ్చి రూ. 38 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా సాయం చేస్తుందని చెప్పి సర్ది చెప్పి పంపేశారు.
ఈ ఘటనపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేర్వేరు ఘటనల్లో బాధితుల పట్ల.. ఎందుకు వేర్వేరుగా స్పందిస్తున్నారని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తమకు రూ. రెండు కోట్ల పరిహారం చెల్లించాలని.. శ్రీనివాసరావు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఇచ్చినట్లుగా రూ. కోటి ఎందుకు ఇవ్వరని.. టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎస్పీవై రెడ్డి పరిశ్రమను… ప్రస్తుతం ఓ ఎంపీ లీజుకు తీసుకుని నడిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం ఏపీలో పుట్టుకొచ్చిన కొత్త రకం బ్రాండ్ల మద్యంలో ఓ బ్రాండ్ విస్కీ తయారవుతోందంటున్నారు.