తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనకు అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖులకు వైరస్ సోకుతోంది. పైగా తెలంగాలో కోవిడ్ -19 టెస్టులు నిలిపివేయడంతో ప్రజల్లో అలజడి రేగుతోంది. భారీగా శాంపిళ్లు ఉన్నాయని.. వాటిని పరీక్షించిన తర్వాతే కొత్త శాంపిళ్లు తీసుకుంటామన్న ప్రకటనను నాలుగు రోజుల క్రితం తెలంగాణ సర్కార్ చేసింది. అంతే.. శాంపిళ్ల సేకరణ నిలిపివేసింది. ఇప్పటికి నాలుగు రోజులు అయింది. సేకరించిన శాంపిళ్లను టెస్టులు చేస్తున్నారు.. రోజుకు.. ఎనిమిది వందలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కానీ.. కొత్త శాంపిళ్ల సేకరణ మాత్రం ప్రారంభం కాలేదు. ప్రైవేటు ల్యాబ్స్‌కు కూడా ప్రభుత్వం మళ్లీ చెప్పే వరకూ శాంపిళ్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం ప్రజల్లో కరోనా ఫోబియా ఉంది. తుమ్మినా.. దగ్గినా కరోనా కారణం కావొచ్చన్న భయంతో ఉన్నారు. ఇక జ్వరం లాంటిది వస్తే.. భయంతో వణికిపోతున్నారు. ఆస్పత్రుల్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా.. ప్రజలు టెస్టుల కోసం.. పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం శాంపిళ్ల సేకరణ నిలిపివేయడంతో.. ఈ భయాలు మరింతగా పెరుగుతున్నాయి. గ్రేటర్లో భారీ ఎత్తున నమోదవుతున్న కేసులతో.. కంటెన్మెంట్ జోన్లు పెరిగిపోతున్నాయి. ప్రజల మానసిక పరిస్థితిలో తేడా వస్తోంది. జర్నలిస్టుల కోసం… ప్రత్యేకంగా కొన్ని రోజులు శాంపిళ్లు తీసుకున్న ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు అవి కూడా తీసుకోడం లేదు. పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రులకు కూడా తీసుకెళ్లడం లేదని ప్రచారం జరుగుతోంది.
తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిని మాత్రమే.. ఆస్పత్రులుక తీసుకెళ్లి.. మిగతా వారిని హోం క్వారంటైన్‌లోనే ఉండాలని.. మెడిసిన్స్ వాడాలని సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్న ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తోంది. దీనిపై కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. లవ్ అగర్వాల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో పర్యటిస్తోంది. భారీగా ఖర్చు పెట్టి రెడీ చేశామని తెలంగాణ సర్కార్ చెప్పుకుంటున్న టిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. మిగతా ఏర్పాట్లనూ పరిశీలించనున్నారు. పరిస్థితి చూస్తే.. హైదరాబాద్ లో కరోనా పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కేంద్రం రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.