వందల ఎకరాల వస్తీర్ణంలో రామోజీ రావు నిర్మించిన మహా సామ్రాజ్యం… రామోజీ ఫిల్మ్ సిటీ. ఆసియాలో అతి పెద్ద సినిమా స్టూడియోగా కీర్తి గడించింది. గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. ఇప్పుడు ఈ రామోజీ ఫిల్మ్‌సిటీని అద్దెకు ఇచ్చారన్న వార్తలు బయటకు వస్తున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థల షూటింగుల నిమిత్తం, రామోజీ ఫిల్మ్‌సిటీని లీజుకు ఇచ్చేశారని వార్తలు ఊపందుకున్నాయి. వీటిపై ఫిల్మ్‌సిటీ యాజమాన్యం స్పందించింది. రామోజీ ఫిల్మ్‌సిటీని అద్దెకు, లీజుకు ఇచ్చారన్న వార్తల్లో నిజం లేదని తేల్చేసింది. అయితే సోనీ పిక్చర్స్, జీ టీవీ వాళ్లని రామోజీ ఫిల్మ్‌సిటీ సాదరంగా ఆహ్వానించినట్టు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో ముంబైలో షూటింగులు చేసుకునే పరిస్థితి లేదు. దేశంలో ఎక్కడా షూటింగులకు అనువైన వాతావరణం లేదు. దాంతో ఫిల్మ్‌సిటీకి వచ్చి షూటింగులు చేసుకోమని… ప్రతినిధులు ఆహ్వానించార్ట. షూటింగులకు అనువైన మౌళిక వసతుల్ని ఉచితంగా కల్పిస్తామని ఫిల్మ్‌సిటీ ఆహ్వానాలు అందించిందని, వాటిని జీ, సోనీ పిక్చర్స్ అంగీకారం తెలిపిందని సమాచారం.
* ఫిల్మ్‌సిటీకి లాభమేంటి?
ఫిల్మ్‌సిటీ లో ఉన్న మౌళిక వసతులు, సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి సెట్ కావాలన్నా…. అతి తక్కువ సమయంలో వేసి, ఇవ్వగల సామర్థ్యం ఫిల్మ్‌సిటీకి ఉంది. సెట్ ప్రాపర్టీ ఏం కావాలన్నా.. అమర్చగలదు. ఎంత విశాలమైన సెట్ అయినా వేసుకోగల సౌకర్యాలున్నాయి. అంత చోటుంది. షూటింగ్ ఫ్లోర్స్ ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. షూటింగులకు అనువైన స్థలాన్ని మాత్రమే ఫిల్మ్‌సిటీ ఉచితంగా అందిస్తుంది. కెమెరాలు, ఇతర సామాగ్రీ ఫిల్మ్‌సిటీ దగ్గర అద్దెకు తీసుకోవాలి. నటీనటులు, సాంకేతిక నిపుణులకు తార – సితారలలో ఎలాగూ ఆతిథ్యం తీసుకోవాల్సివుంటుంది. ఇవన్నీ ఫిల్మ్‌సిటీకి లాభమే. పైగా.. నెలలు తరబడి పనులు లేక ఖాళీగా ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందికి ఉపాధి దొరుకుతుంది. ఇలా అన్ని రకాలుగా ఆలోచించే `ఉచిత` ప్రకటన చేసింది ఫిల్మ్‌సిటీ యాజమాన్యం.