కర్ర విరగకుండా..పాము చావకుండా… విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుపై.. ముఖ్యమంత్రి జగన్‌కు సమాధానం పంపారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆ లేఖలో ఆయన తాను మొదటి నుంచి వినిపిస్తున్న వాదనలతో పాటు..కొత్తగా.. ఏపీ సర్కార్ క్రిస్టియానిటీని ప్రోత్సాహిస్తోందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు జత కలిపి.. మరింత రాజకీయం అంటించారు. లేఖలో జగన్మోహన్ రెడ్డిని పొగడాల్సినంతగా పొగిడారు. అదే సమయంలో… అసలు పార్టీ గుర్తింపుపైనే ప్రశ్నలు సంధిచారు. విజయసాయిరెడ్డి రిజిస్టరయిన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్‌తో నోటీసు పంపారని.. లేఖలో పేర్కొన్న ఎంపీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని.. పలు సందర్భాల్లో ఈసీ మన పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయిని చెప్పుకొచ్చారు. అంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు వాడుకోవద్దని.. గతంలోనే లేఖలు రాసిందనే విషయాన్ని రఘురామకృష్ణం రాజు ఈ లేఖ ద్వారా బయటపెట్టారన్నమాట.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును ఏ సందర్భంలోనూ… వాడుకునే అవకాశం లేదని ఈసీ తేల్చి చెప్పిందని ఎంపీ పదే పదే గుర్తు చేశారు. టీటీడీ ఆస్తుల అమ్మకం.. ఇంగ్లిష్ మీడియం విషయంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలనే వివరించాననన్నారు. అలా ప్రకటన చేసినందున.. జగన్ చుట్టూ ఉన్న వ్యక్తులు తనను క్రిస్టియన్ వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారని లేఖలో జగన్‌కు .. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. నిర్బంధ ఇంగ్లిష్ మీడియం రాజ్యాంగ విరుద్ధమని… రాజ్యాంగం ప్రకారమే వ్యవహరిస్తానని.. లోక్‌సభలో ప్రమాణం చేశానని.. అందుకు అనుగుమంగానే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించానన్నారు. ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజల సమస్యనే లేవనెత్తానని.. అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడాకే… తాను స్పందించానని గుర్తు చేశారు.
ఇలా ప్రతీ విషయంలోనూ తాను చేసింది కరెక్టేనని.. రఘురామకృష్ణంరాజు జగన్‌కు స్పష్టం చేశారు. గతంలో తాను ఇచ్చిన విందుకు బీజేపీ నేతల్ని మాత్రమే ఆహ్వానించలేదన్నారు. తన గెలుపులో 90శాతం క్రెడిట్ జగన్ కే దక్కుతుందని.. లేఖలో రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు దిష్టిబొమ్మలు తగులబెట్టడం… దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడం వల్లనే.. కేంద్ర భద్రతను కోరానని లేఖలో స్పష్టం చేశారు. ట్విస్ట్ ఏమిటంటే… లేఖను షోకాజ్ నోటీసుకు ఆన్సర్‌గా ఆయన చెప్పలేదు.. అదే సమయంలో… యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నమ్మకమైన సైనికుడ్నని ప్రకటించుకున్నారు.