ఉత్తమ్ – కేటీఆర్ రాజకీయంగా ఉప్పు..నిప్పుగా ఎప్పుడూ లేరు కానీ… అలా అని ఒకరిపై ఒకరు ఎప్పుడూ ప్రశంసల వర్షం కురిపించుకోలేదు. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. చేసుకోవాలి కూడా. ఎందుకంటే.. తెలంగాణ పవర్ సెంటర్లో కీలకమైన వ్యక్తి కేటీఆర్. ఆ పవర్ సెంటర్ కు ప్రతిపక్ష నేతగా.. టీ పీసీసీచీఫ్‌గా ఉన్న వ్యక్తి ఉత్తమ్. మీరు భలే.. భలే అని పొగుడుకుంటే రాజకీయంగా… ఏదో తేడా కొడుతుందే అన్న అనుమానం అన్ని వైపుల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఎవరేమనుకున్నా సరే.. ఇద్దరూ మీరు సూపరంటే..మీరు సూపరని పొగుడుకున్నారు. ఈ ఘటన ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్లోనే జరిగింది.
ఎన్నికల హామీల్లో భాగంగా హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఎంపీగా ఉన్న ఉత్తమ్ కూడా హాజరయ్యారు. కొద్ది రోజుల కిందట.. ఓ కార్యక్రమంలో ఇలా ఒకే వేదికపై ఉన్న జగదీశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసుకోవడంతో అలాంటిదేదో ఇక్కడా జరుగుతుందని అనుకున్నారు. కానీ సిట్యుయేషన్ మాత్రం వేరేలా ఉంది. హైదరాబాద్, విజయవాడ సూపర్ ఫాస్ట్ ట్రైన్ గానీ.. బుల్లెట్ ట్రైన్‌గా వేయాలని.. ఉత్తమ్ కేటీఆర్‌ను కోరారు. కోరికతో పాటు డైనమిక్ పర్సన్ లాంటి మీరు చేయగలుగుతారని ఓ పొగడ్త కూడా వదిలారు.
వెంటనే కేటీఆర్ కూడా.. టీ పీసీసీ చీఫ్‌ను పొగిడారు. అన్నా అంటూ సంబోధించారు. ఐదేళ్ల పాటు టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందుకు అభినందనలు తెలిపారు. అధికారం ఉంటుంది.. పోతుంది.. కానీ తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన అంశాలపై దృష్టి సారిస్తామన్నారు. కొన్నాళ్ల కిందట.. అసెంబ్లీలో తన ఫోన్‌ను ఎందుకు బ్లాక్‌లిస్టులో పెట్టావని ఉత్తమ్ కేటీఆర్ ను ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ నేతల్లో ఓ రకమైన అనుమానం ఏర్పడింది. ఇప్పుడు ఇలా ఒకరినొకరు పొగుడుకోవడంతో.. ఉత్తమ్‌ను వ్యతిరేకించేవారిలో మరిన్ని అనుమానాలు పెరగడం ఖాయమని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ రాజకీయం అంతే ఉంటుంది.