కరోనా మహమ్మారి చిత్ర రంగాన్ని స్థంభింపజేసిందన్నది ఎంత నిజమో, సరికొత్త ఆలోచనలకు బీజం వేసిందన్నది కూడా అంతే నిజం. సినిమాలకు కరోనా ఓ కొత్త కథా వస్తువు అయిపోయింది. లాక్ డౌన్ నేపథ్యాల్ని, కరోనా కష్టాల్నీ, దీని వెనుక ఉన్న నిజాల్ని చెప్పేందుకు కథకులు, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. చిత్రసీమలో ఇప్పటికే అరడజను ‘కరోనా’ ప్రాజెక్టులు స్క్రిప్టు దశలో ఉన్నాయి.
అల్లరి నరేష్ కూడా కరోనాపై ఓ కథ రాశాడట. ప్రస్తుతం దాన్ని సినిమా కొలతలకు సరిపడా స్క్రిప్టుగా మలచడంలో బిజీగా ఉన్నాడట. కరోనా కథ అని చెప్పి – సైంటిఫిక్ విషయాలేం ఉండవు. లాక్ డౌన్ సమయంలో సగటు భర్త ఇంట్లో ఎలాంటి బాధలు పడ్డాడో చెబుతూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని రాసుకున్నాడట నరేష్. ఈ కథ మరో దర్శకుడి చేతిలో పెట్టి, సినిమాగా మలచాలన్నది నరేష్ ప్రయత్నం. ”లాక్ డౌన్ ఒకొక్కరికీ ఒక్కో అనుభవాన్ని ఇచ్చింది. నాకూ కొన్ని గమ్మత్తైన అనుభవాలు ఉన్నాయి. వాటి నేపథ్యంలో సరదాగా ఓ కథ రాశాను. ఓ మంచి రైటర్ చేతిలో పెట్టి.. స్క్రిప్టుగా మార్చాలి. అయితే ఈ కథకు నేను దర్శకత్వం వహించను” అన్నాడు నరేష్. అన్నట్టు ఈరోజు నరేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘నాంది’ టీజర్ విడుదలైంది. ఆ టీజర్‌కి మంచి స్పందన వస్తోంది.