తెలుగు360 రేటింగ్: N/A
థ్రిల్లర్ అంటేనే చిక్కుముడుల సమాహారం. చిక్కులు ఎంత చిక్కగా ఉంటే, అంత కిక్కు. అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. చిక్కుముడులు ఎవరైనా వేయొచ్చు. కానీ దాన్ని విప్పే నేర్పు, నేర్పుగా చెప్పే ప్రతిభ కొంతమందికే ఉంటుంది. థ్రిల్లర్స్ సక్సెస్ అయ్యేది అక్కడే. ఓ ఫజిల్ ఇవ్వడం తేలిక. దాన్ని సాల్వ్ చేయడం కష్టం. థ్రిల్లర్ కష్టమంతా అక్కడే వుంది. వెండి తెరని నమ్ముకుని తీసినా – ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైన 47 డేస్ కూడా ఓ థ్రిల్లరే. ఇందులోనూ కావల్సినన్ని చిక్కుముడులున్నాయి. మరి వాటిని విప్పిన నేర్పు ఎలా వుంది..? ఫజిల్ సాల్వ్ చేసిన పద్ధతేంటి?
కథ
సత్య (సత్యదేవ్) అనాథ. కష్టపడి చదివి ఏసీపీ అవుతాడు. తనలాంటి మరో అనాథ పద్దూ (రోషిణి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పద్దూ కోసం స్వేచ్ఛ అనే పాపాయిని దత్తత తీసుకుంటాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న తరుణంలో పద్దూ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పటి నుంచీ సత్య జీవితం మారిపోతుంది. పద్దూ లేకపోయినా, ఉన్నట్టు భ్రమిస్తుంటాడు. ఆ భ్రమల్లో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాడు. తన అజాగ్రత్త వల్ల ఏఎస్ఐ కాళ్లు కోల్పోవాల్సి వస్తుంది. చివరికి నెల రోజుల పాటు సస్పెండ్ అవుతాడు. కొన్ని రోజులు తరవాత… శ్రీనివాస్ అనే ఓ ఐటీ కంపెనీ యజమాని ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ ఆత్మహత్యకీ పద్దూ ఆత్మహత్యకీ లింకు ఉందని గ్రహిస్తాడు సత్య. అప్పటి నుంచీ తన ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. సరిగ్గా 47 రోజుల్లో ఈ కేస్ ని సాల్వ్ చేస్తాడు. ఇంతకీ పద్దూకీ శ్రీనివాస్కీ లింకేంటి? ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న కారణం ఏమిటి? నిజానికి ఇవి ఆత్మహత్యలా? హత్యలా? తెలియాలంటే 47 డేస్ చూడాలి.
విశ్లేషణ
థ్రిల్లర్ సినిమాలకు కావల్సిన ముడి సరుకు ఈ కథలో ఉంది. ఫజిల్ ఉంది. చిక్కుముడులున్నాయి. కానీ… ఓ థ్రిల్లర్ కథ పండాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ప్రేక్షకుడికి ఎదురైన ప్రతి ప్రశ్నకూ లాజికల్ గా సమాధానం చెప్పాలి. ప్రేక్షకుడి ఊహకు అందని ముగింపు ఇవ్వాలి. అదే అసలైన థ్రిల్. ఈ కథని మొదలెట్టిన విధానం, దాన్ని నడిపిన పద్ధతీ, ఇంట్రవెల్ ట్విస్టు – ఇవన్నీ సాదా సీదాగా ఉన్నాయి. థ్రిల్లర్స్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం. వేగం. ఊపిరి తీసుకుని వదిలేలోగా సన్నివేశాలు పరిగెట్టాలి. ప్రతీ పది నిమిషాలకూ… ఓ కుదుపు. ఓ పశ్న ఎదురు కావాలి. కానీ 47 డేస్లో అదే జరగదు. అరగంట తరవాత కూడా కథ ఎక్కడ మొదలైందో అక్కడే ఉంటుంది. మధ్యమధ్యలో కొన్ని ప్రశ్నలు ఎదురైనా వాటికి ప్రేక్షకుడ్ని సీట్లకు అతుక్కునేలా చేసేంత శక్తి లేదు.
జూలియట్ అనే పాత్ర కథ మధ్యలో ప్రవేశిస్తుంది. దాని వెనుక పెద్ద కథ ఉందని ప్రేక్షకులు భావిస్తారు. తీరా చూస్తే… దానికి ఓ ఛైల్డ్ ఎపిసోడ్ తో లింకు కట్టి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు దర్శకుడు. అయితే… ప్రేక్షకుడికి ఇలాంటి తెలివి తెటలు నచ్చవు. తన ఊహకు మించిన సంగతేదో జరిగి ఉంటేనే కిక్. అది `47 డేస్`లో కనిపించలేదు. పద్దూ ఆత్మహత్య కి గల కారణం అన్వేషిస్తూ సత్య ఓ ప్రయాణం మొదలెట్టాడు. అది అటు తిరిగి ఇటు తిరిగి డ్రగ్స్ మాఫియా వైపుకు వెళ్లిపోతుంది. ఎప్పుడైతే డ్రగ్స్ మాఫియా వైపుకి కథ తిరిగిందో, ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడం ప్రేక్షకుడికి పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఏం జరిగింది? అనే విషయాన్ని నేరుగా విలన్ చేతే చెప్పించేయడం మరో ఎస్కేపిజం. దాన్ని పసి గట్టాల్సింది హీరో కదా. మరి అప్పటి వరకూ చేసిన ఇన్వెస్టిగేషన్, హీరో తెలివి తేటలు ఏమైనట్టు..? శ్రీనివాస్ – జూలియట్ ల లవ్ ట్రాక్ కూడా బాగా సాగదీశారు. క్లైమాక్స్ లో ఏదో ట్విస్టు ఉంటుందని భావించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది.
నటీనటులు, సాంకేతికత
సత్య మంచి నటుడు. తన కథల ఎంపిక కూడా బాగుంటుంది. కానీ ఈసారి పప్పులో కాలేశాడు. తనలోని నటుడ్ని గానీ, హీరోని గానీ బయట పెట్టేంత స్కోప్ సత్య పాత్రలో లేదు. పద్దూ, జూలియట్ పాత్రధారుల్ని హీరోయిన్లు అనలేం. రవి వర్మ, సత్య ప్రకాష్ గత సినిమాల్లో ఎలాంటి నట విన్యాసాలు ప్రదర్శించారో.. ఇప్పుడూ అంతే. ఎలాంటి మార్పూ లేదు. ఇలాంటి కథల్లో పాటల్ని మినహాయించాలి. అప్పుడే ఓ ఫ్లో వస్తుంది. అసలే నిదానంగా సాగుతున్న కథలో, పాటల్ని తెచ్చారు. రెండే రెండు గీతాలున్నాయి. అవి కూడా అనవసరం అనిపిస్తాయి. రఘు కుంచె ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువల పరంగానూ చెప్పుకోదగినంతగా మెరుపుల్లేవు. మినిమం బడ్జెట్లో ముగించారు. నిడివి గంటా నలభై ఐదు నిమిషాలంతే. కానీ మూడు గంటల సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ రాసుకున్నప్పుడు ట్విస్టులు ఉన్నట్టు అనిపించినా – తీసినప్పుడు మాత్రం ఆ మలుపులు చప్పగా అనిపించాయి.
మొత్తానికి 47 డేస్ – ఏ దశలోనూ మెప్పించని చిత్రం. థ్రిల్లర్లో ఉండే వేగం, ఉత్కంఠత ఈ కథలో లోపించాయి.
తెలుగు360 రేటింగ్: N/A