“కుయ్..కుయ్..” వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ సారి ఎన్నికల ప్రచారంలో 108 అంబులెన్స్‌ల గురించి చెబుతూ… అలా శబ్దం చేస్తూ వస్తాయని ప్రాణాలు నిలుపుతాయని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ చెప్పిన విధానమే… కాదు.. నిజంగానే 108 అంబులెన్స్‌లు ప్రాణదాతలుగా ఉండటంతో.. అప్పుడే ఆ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆ “కుయ్.. కుయ్” 108 అంబులెన్స్‌లతో పాటు వైఎస్ గురించి ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చినా అందరూ గుర్తు పెట్టుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందక అనేక మంది మరణిస్తున్న తరుణంలో, సకాలంలో వైద్య సేవలందాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ 108ను ప్రవేశపెట్టారు.
పేదోడి నాడి తెలిసిన వైఎస్ఆర్ ఆలోచన 108..!
పేదోడి నాడి తెలిసిన డాక్టర్‌గా దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని చెబుతూ ఉంటారు.. కాంగ్రెస్ నేతలు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ.. ఎంతోమంది పేదలకు ‘ఊపిరి’ పోసింది. అలాగే ఆయన హయాంలో ప్రారంభమైన 108 అంబులెన్స్‌లు .. ఏదన్నా ప్రమాదం జరిగినా, హఠాత్తుగా గుండె నొప్పి ఇతర ప్రాణాంతకమైన సమస్యలు తలెత్తినా తక్షణం స్పందించేవి. 108కి కాల్ చేస్తే చాలు.. అతి తక్కువ సమయంలో అంబులెన్స్ అందుబాటులోకి వచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. పేదోడి ఆయువు నిలబెట్టే సంజీవనిగా ఈ 108, 104 అంబులెన్స్‌లను చూడాల్సి వస్తుంది. గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా, గిరిజన ప్రాంతాల్లో అయినా అత్యవసర పరిస్థితుల్లో వున్నవారికి అందుబాటులోకి వచ్చేలా ఈ అంబులెన్స్‌లను రూపొందించారు.
గ్రామాల ముగింటకు వైద్యం..!
104 వాహనాల ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్ళి మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఈ వాహనాల్లోనే ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్స్ ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందుల్ని రోగులకు ఇస్తారు. టెలిమెడిసిన్ విధానం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారిని అతి తక్కువ సమయంలో ఆసుపత్రులకు చేర్చి, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అంబులెన్స్‌లు ఎంతగానో ఉపయోగపడ్తాయి.
108కి మౌలిక సమస్యలు లేకుండా చేస్తే ప్రాణప్రదాతే..!
వైఎస్ఆర్ ఆలోచన అయిన 108 ఆ తర్వాత కాలంలో.. దేశం మొత్తం విస్తరించింది. ప్రజలకు బాగా ఉపయోగపడుతున్న అంబులెన్స్‌లు కావడంతో.. అన్ని రాష్ట్రాలు.. కేంద్రం కూడా.. అందుబాటులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు 108 సర్వీసులు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వీటిని నిర్వహించుకుంటున్నాయి. అయితే.. ప్రభుత్వాలు.. రాను రాను.. వటి మీద పెట్టే ఖర్చు తగ్గించుకుంటూ పోతూండటం వల్ల సమస్య వస్తోంది. అందులో ఆక్సీజన్ లాంటి సౌకర్యాలు కల్పించడానికి నిధులు వెచ్చించడం లేదు. అందువల్ల వాటి లక్ష్యం కూడా దెబ్బతింటోంది. అలాంటి మౌలిక సమస్యలు కూడా లేకుండా చేయాలని.. జగన్ ప్రయత్నిస్తున్నారు.