కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ పనితీరు పదే పదే హైకోర్టు ఆగ్రహానికి కారణం అవుతోంది. కొద్ది రోజుల కిందట.. గ్రేటర్లో యాభై వేల పరీక్షలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం… తర్వాత మూడు రోజుల పాటు పూర్తిగా టెస్టులు నిలిపివేసింది. దీంతో.. గతంలో పిటిషన్ వేసిన వ్యక్తులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు… ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడింది. ప్రజల జీవంచే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహారిస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఇలా చేయకూడదని గుర్తించాలని స్పష్టం చేసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని.. నిలదీసింది.
మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టులు చేశారు… ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారు.. ఎన్ని టెస్టులు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. 50 వేలు చేస్తామని చెప్పి..జూన్ 26 నుంచి టెస్టులు నిలిపివేయడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. ప్రభుత్వం తీరు కోర్టు ధిక్కర కిందకు వస్తుందని తేల్చింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ టెస్టులు ఎందుకు చేయరని.. పది నిమిషాల్లో రిజల్ట్ ఇచ్చే టెస్టులు చేయాలని కూడా చెప్పామని ఎందుకు చేయలేదని ధర్మానంస మండిపడింది. 17వ తేదిన కోర్టు అడిగిన వివరాలన్ని ఇవ్వకపోతే… జూలై 20న చీఫ్ సెక్రెటరీతో పాటు ఇతర ఉన్నతాధికారుల్ని పిలిపిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. డాక్టర్స్ కు పారమెడికల్ స్టాఫ్‌కి .. పీపీఈ కిట్లు ఇవ్వకపోవడాన్ని కూడా కోర్టు ధిక్కరణ కిందకు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.
కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్.. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటోంది. అతి తక్కువ టెస్టులు చేస్తూ.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారమే టెస్టులు చేస్తున్నారమని.. ఎదురుదాడికి దిగుతోంది. విపక్ష నేతల విమర్శలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే.. కోర్టులో మాత్రం.. తీవ్రమైన ఆక్షేపణలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. కోర్టు ఆదేశాలను కూడా లైట్ తీసుకుంటూండటంతో.. తరచూ న్యాయస్థానం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వం తీరులో మార్పు రావడం లేదు.