విజయసాయిరెడ్డి పెత్తనానికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టారంటూ…కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అధికారికంగా ముద్రపడింది. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతల్ని సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగిస్తూ..జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు విజయసాయిరెడ్డికి.. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో .. వైవీ సుబ్బారెడ్డికి.. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో.. పార్టీ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ అప్పగించారు.
గతంలోనూ… విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలే ఉండేవి. ఇతర నేతలకు వేలే జిల్లాలు కేటాయించేవారు. కానీ.. పార్టీ వ్యవహారాలను మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. పార్టీ కేంద్ర కార్యాలయం మొత్తం ఆయన గుప్పిట్లో ఉండేది. ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ టీంతో సమన్వయం చేసుకోవడం పార్టీ టిక్కెట్ల వ్యవహారం .. మొత్తం విజయసాయిరెడ్డినే డీల్ చేశారు. మొన్నటిదాకా ఆయనకు తిరుగులేదనే ప్రచారం ఉంది. కానీ హఠాత్తుగా ఏం జరిగిందో కానీ..మెల్లగా ఆయనను దూరం పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలోనూ ఆయన ఇటీవల కనిపించడం తగ్గించారు.
ఢిల్లీలో వ్యవహారాలను మరో ఎంపీ బాలశౌరి చక్క బెడుతున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లకే పరిమితం అవుతున్నారు. ఈ సమయంలో.. ఆయనకు ప్రాధాన్యం తగ్గిస్తూ..నిర్ణయం వెలువడింది. ఒక్క సారి విజయసాయిరెడ్డిపై జగన్ వ్యతిరేకంగా ఉన్నారు..అన్న ప్రచారం జరిగితే.. ఆయన వైపు ఒక్క వైసీపీ నేత కూడా కన్నెత్తి చూడరు. ఒకప్పుడు ఆయనతో రాసుకుపూసుకు తిరగడానికి ప్రాధాన్యం ఇచ్చే నేతలు.. ఆయనతో కన్నా.. సజ్జలతో టచ్లో ఉండటానికి ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు.