తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ వస్తోంది. యాజమాన్యం మారిన తర్వాత చాలా మంది రవిప్రకాష్ మిత్రులు.. టీవీ9లో కొనసాగుతున్నప్పటికీ.. వారందరూ.. యాజమాన్య భావాలకు అనుగుణంగా తమను తాము ట్యూన్ చేసుకుని ఉద్యోగాలు కాపాడుకున్నారు కానీ.. జర్నలిజం ఫస్ట్ అనుకోలేదు. ఆ ప్రభావం టీవీ9పై స్పష్టంగా కనిపిస్తోంది. జాఫర్ నుంచి టీవీ9 నుంచి వరుసగా ప్రతిభావంతులు నిష్క్రమిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో అవినాష్ చేరారు. అవినాష్ అంటే.. బయట మీడియాలో వారికి కూడా తెలియదు. కానీ… వికటకవి, సైలెన్స్ ప్లీజ్ కార్యక్రమాల మాస్టర్ మైండ్ అంటే అందరికీ తెలుసు.
అవినాష్.. ప్రతిభావంతమైన యానిమేటర్. అంతకు మించి సైటైరిక్ ఆలోచనలు ఉన్న జర్నలిస్టు. టీవీలో మూడు, నాలుగు నిమిషాలు వచ్చినా… వికటకవి అనేది.. ఈనాడులో శ్రీధర్ పాకెట్ కార్టూన్ అంతగా ఫేమస్ అయింది. ఈనాడు పేపర్‌లో శ్రీధర్ కార్టూన్ కనిపించకపోతే.. పాఠకులకు ఎంత వెలితిగా ఉంటుందో… టీవీ9లో వికటకవి కనిపించకపోయినా అంతే వెలితి ఉండేది. ఈ వికటకవికి కర్త కర్మ క్రియ అయిన అవినాష్… కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాత సైలెన్స్ ప్లీజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అది కూడా నచ్చలేదేమో కానీ.. డోర్స్ చూపించేసింది కొత్త యాజమాన్యం. పొమ్మనలేక పొగ పెట్టేశారనే ప్రచారం టీవీ9 క్యాంపస్‌లో జరుగుతోంది.
టీవీ మీడియా క్రియేటివ్ రంగం. ఒక్క ప్రోగ్రాం చానల్‌ను నిలబెడుతుంది. అలాంటి ప్రోగ్రాంలు టీవీ9కి అందించిన క్రియేటర్లు ఒక్కొక్కరు.. ఆ చానల్‌ను వదిలి వెళ్లిపోతున్నారు. వ్యవస్థాపకుడే వెళ్లిపోయిన తర్వాత మిగిలిన వారు ఉండటం కష్టమే. ఉండాలనుకున్నా యాజమాన్యం ఉండనీయడం లేదు. వారికి బదులుగా… మరొకర్ని తీసుకు రావొచ్చు కానీ.. అనుకరణ ఎప్పుడూ అనుకరణే.. కానీ అదే మొదటిది అవ్వదు. ఈ విషయం యాజమాన్యం తెలుసుకునేలోపు.. జరిగే నష్టం జరిగిపోవచ్చు. ఇప్పటికి రేటింగ్స్ వస్తున్నాయి కదా.. అని సంబర పడొచ్చు.. కానీ తప్పిదాలు చేశామని.. కుప్పకూలిన తర్వాత ఎవరైనా తెలుసుకుంటారు. టీవీ9 కొత్త యాజమాన్యం ఆలోచన ఎలా ఉందో మరి..!