ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఇంకా అందలేదు. మరో నాలుగైదు రోజులు అందుతాయనే గ్యారంటీ లేదు. ఒక్క జీతాలే కాదు..మరో మూడు నాలుగు రోజుల పాటు.. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరపున చెల్లింపులు జరగవు. దీనికి కారణం ఖజానాలో డబ్బుల్లేకపోవడం కాదు… మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి లేకపోవడం. ఈ అసాధారణమైన పరిస్థితిని ప్రభుత్వమే చేజేతులా కొని తెచ్చుకుంది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది.
సహజంగా.. బడ్జెట్ను ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రవేశ పెట్టి ప్రభుత్వాలు శాసనసభ.. మండలిలో ఆమోదింప చేసుకుంటాయి. కానీ వివిధ కారణాల వల్ల ఏపీ సర్కార్ ఆ పని చేయలేకపోయింది. బడ్దెట్ పెట్టలేకపోవడంతో…మొదటి నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ ద్వారా గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తెప్పించుకుని బండి నడిపించింది. మొన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ ఆమోదింప చేసుకుంది. కానీ శాసనమండలిలో కూడా ఆమోదం పొందితేనే గవర్నర్ సంతకం పెడతారు. అక్కడ ఆ బిల్లు పెట్టమని టీడీపీ సభ్యులు చెప్పినా.. రాజధాని తరలింపు బిల్లులు పెట్టడం… ఎమ్మెల్సీలు కొట్టుకోవడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. పధ్నాలుగు రోజుల తర్వాత బిల్లు ఆటోమేటిక్గా ఆమోదం పొందుతుంది.
30వ తేదీతో 14 రోజులు అయిపోయాయి. ఆమోదం పొందినట్లుగానే భావించి గవర్నర్ వద్దకు ఫైల్ పంపాల్సిన ప్రభుత్వం పంపలేదు. దీంతో.. జీతాలు ఆలస్యమయ్యాయి. శనివారం తర్వాతే జీతాలొస్తాయని ప్రభుత్వం ఉద్యోగులకు చెబుతోంది. పనిలో పనిగా.. టీడీపీ వల్లే ఆలస్యం అయ్యాయని చెబుతోంది. సమయానికి జీతాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆలస్యం అయితే.. ప్రభుత్వాన్నే అంటారు … కానీ ప్రతిపక్షాన్ని ఎవరూ ఏమీ అనలేరు. అయితే.. ప్రభుత్వం మాత్రం.. టీడీపీపైనే ఎదురుదాడికి దిగుతోంది. ఉద్యోగులు మాత్రం.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 నెలలు జీతాలిస్తే.. కనీసం 10 సార్లు సమయానికి జీతాలు రాలేదని గుర్తు చేసుకుని నిట్టూరుస్తున్నారు.