రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడూ ఢిల్లీ వ్యవహారాలను పట్టించుకునే విజయసాయిరెడ్డి ఈ సారి దూరంగా ఉన్నా.. ఎంపీ బాలశౌరి లీడ్ తీసుకుని.. తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి స్పీకర్ ఓంబిర్లాను కలిసిన ఆయన.. ఈ సారి.. మొత్తం వైసీపీ ఎంపీలను తీసుకుని వెళ్లి.. మరోసారి రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేయనున్నారు. ఆయన పార్టీ కట్టుబాట్లను దాటిపోయారని.. ఆయనపై అనర్హతా వేటు వేయాలని పిటిషన్ సమర్పించనున్నారు. ప్రత్యేక విమానంలో వీరంతా శుక్రవారం.. ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
అయితే.. వైసీపీ ప్రయత్నాలపై రఘురామకృష్ణంరాజు భిన్నంగా స్పందించారు. ఇప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతున్నాయనుకున్నానని.. కానీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తనపై అనర్హతా వేటు కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ బాలశౌరి భవిష్యత్ ఎలా ఉంటుందోనని చెప్పుకొచ్చారు. ప్రత్యేక విమానంలో.. ఢిల్లీకి రావడం.. ప్రజాధనం వృధా కావడం మినహా ఇంకేమీ జరగబోదన్నారు. తాను పార్టీకి.. పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడలేదని మరో సారి స్పష్టం చేశారు. ప్రజాసమస్యను ప్రస్తావించారని.. అనర్హతా వేటు వేస్తే.. పార్లమెంట్లో ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. వెంకన్న భూములను అమ్మవద్దని అన్నందుకే తనపై వేటు వేసే ప్రయత్నం చేస్తున్నారని.. తాను వెంకన్న దయతో అగ్నిపునీతుడవుతానని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు తనపై అనర్హతా వేటు వేసే విషయంపై ప్రయత్నాలను.. మానుకోవాలని హితవు పలికారు.
మరో వైపు.. రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కేంద్రమంత్రులతో పలుమార్లు భేటీ అయ్యారు. ప్రధానమంత్రి మోడీ పరాక్రమాన్ని ప్రశంసిస్తూ.. రెండు వీడియోలు విడుదల చేశారు. పాటలు కూడా రిలీజ్ చేశారు. తాజాగా.. మోడీ.. నవంబర్ వరకూ పేదలకు రేషన్ ఉచితంగా ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు. అదే సమయంలో.. అమరావతి ఉద్యమంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమయి రెండు వందల రోజులు అయిన సందర్భంగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి మద్దతు తెలియచేయాలని రఘురామకృష్ణంరాజు నిర్ణయించుకున్నారు.