కేసులు భయంకరంగా పెరుగుతున్నాయని.. హైదరాబాద్లో పదిహేను రోజుల పాటు కంప్లీట్ లాక్ డౌన్ విధించాలన్న తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఆలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. కంప్లీట్ లాక్ డైన్ వల్ల మళ్లీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఉద్యోగ, వ్యాపార జీవితాలు మళ్లీ స్తంభించిపోతాయని.. ఇది కొత్త అలజడికి కారణం అవుతుందన్న ఆందోళన ఎక్కువ కావడంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే.. ఒకటి లేదా రెండో తేదీన కేబినెట్ సమావేశం పెట్టి.. లాక్ డౌన్ విధి విధానాలకు ఆమోద ముద్ర వేయాలనుకున్నారు. కానీ.. కేసీఆర్ అధికారులు, మంత్రులతో అదే పనిగా సమీక్ష చేసినా.. లాక్డౌన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్ని చోట్లా లాక్ డౌన్ విధించడం కన్నా… కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట… కఠినంగా నిబంధనలు అమలు చేస్తే చాలన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో.. రోజుకు సగటున ఎనిమిది వందల కేసులు నమోదవుతున్నాయి. గురువారం 998 కేసులు నమోదయ్యాయి. అయితే… చాలా వరకు కేసులు.. కొన్ని డివిజిన్లకే పరిమితమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయా ప్రాంతాల్లో కట్టిడ చర్యలు తీసుకుంటే చాలని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కంటైన్మెంట్ జోన్ల ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలన్న నివేదికను అధికారులు ఇప్పటికే సిద్దం చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ వర్గాల్లో ఇప్పటికి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏం చేయాలన్నదానిపై.. ఉన్నత అధికార యంత్రాగం ఓ అంచనాకు రాలేకపోతోంది.
లాక్ డౌన్ విధించిన రెండు నెలల సమయంలో.. కరోనా కేసులు హైదరాబాద్లో భారీగా నమోదు కాలేదు. కానీ సడలింపులు ఇచ్చిన తర్వాత మత్రం.. పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. సామాజిక వ్యాప్తి జరిగిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏ లక్షణాలు లేని వారికి కనీసం.. 70 మందికి కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వస్తోంది. అలాంటి వారందరికీ.. హోం ఐసోలేషన్ సజెస్ట్ చేసి.. ఇళ్లలోనే ఉంచుతున్నారు. సీరియస్ గా ఉన్న వారిని మాత్రమే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. లాక్ డౌన్ విధించాలా లేదా.. అన్న దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. కేసులు నమోదైన ప్రాంతాల్లో మాత్రం కట్టడి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.