భిన్న ధృవాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి.. అని సైన్స్ చెబుతుంది. ప్రేమ అందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ మాటని బలపరుస్తుంటుంది. చాలా ప్రేమకథలు.. అలా పుట్టినవే. యాదృఛ్చికమో, ప్రేమలో ఉన్న విశేషమో తెలీదు గానీ, అలాంటి కథలే వర్కవుట్ అయ్యాయి. భానుమతి రామకృష్ణ కూడా అంతే. ఇద్దరివీ వేరు వేరు ప్రపంచాలు. నేపథ్యాలూ. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ ఎప్పుడు ఎలా పుట్టింది? ఆ ప్రేమ కథ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంది..? ఇదే `భానుమతి రామకృష్ణ` స్టోరీ!
రామకృష్ణ (నవీన్ చంద్ర) .. ఈ సినిమాలో హర్ష చెప్పినట్టు చంటి సినిమాలో వెంకటేష్ టైపు. పక్క పాపిటి, నుదుట బొట్టు. ఇడ్లీ – పెరుగన్నం బాపతు. భానుమతి కథ వేరు. 30 ఏళ్లు దాటినా పెళ్లవ్వని ఫ్రస్ట్రేషన్. అందులోనూ ఓ బ్రేకప్. దాన్ని మర్చిపోయేందుకు పబ్ లూ, టకీలాలూ. `మగాళ్లే మందు కొట్టాలని – ఆడవాళ్లు ముట్టకూడదని రూలు లేదు` అని వాదించే తరహా!. లైఫ్ అంతా తన ఛాయిస్ ప్రకారమే సాగాలి అనుకుంటుంది. మొండితనం ఎక్కువ. ఇండిపెండెంట్ గా ఉండాలనుకంటుంది. అలాంటి అమ్మాయి (సారీ.. ఆంటీ) దగ్గర సహాయకుడిగా వస్తాడు రామకృష్ణ.
రామకృష్ణ ని అందరి మగవాళ్లలానే జమ కట్టినా – మెల్లమెల్లగా రామకృష్ణ మంచితనం, అమాయకత్వం, పాజిటీవ్‌నెస్.. ఇవన్నీ నచ్చేస్తాయి భానుమతికి. రామకృష్ణ కూడా భానుమతిలోని పసి పిల్లని చూడగలుగుతాడు. ఇద్దరూ దగ్గరవుతున్న తరుణంలో.. చిన్న బ్రేక్. దాన్నుంచి ఇద్దరూ ఎలా బయట పడ్డారు? భానుమతి – రామకృష్ణ.. లు ఎలా ఒక్కటయ్యారు అనేదే కథ.
కథ సింపుల్. ఇదో మామూలు ప్రేమకథ. ఏజ్ బారైన ప్రణయ గాథ. కానీ.. దానికి మెచ్చూరిటీ లెవిల్స్ అద్ది, చిన్న చిన్న ఎమోషన్స్ యాడ్ చేసి – మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగాడు దర్శకుడు. అటు భానుమతిని, ఇటు రామకృష్ణనీ ఇద్దరినీ ఒకేలా ప్రేమించి ఈ కథని రాసుకున్నాడు. అందుకే రెండు పాత్రలూ పోటీ పాటీగా పండాయి. రామకృష్ణలోని మంచితనాన్ని ఎంతగా ఇష్టపడతామో, భానుమతిలోని డేరింగ్ డాషింగ్ క్వాలిటీని అంతగా ప్రేమిస్తాం. సిటీ బేస్డ్ లవ్ స్టోరీ ఇది. ఓ పక్క సహజీవనం చేస్తున్న ఓ జంట కథని చెబుతూనే – వాళ్ల ముద్దు మురిపాలు చూపిస్తూనే – మెచ్యూరిటీ లెవల్స్ ఉన్న మరో జంట ఎంత కామ్ గా, తమ హద్దుల్లో ఎలా ఉండగలరో – చక్కగా ఆవిష్కరించాడు దర్శకుడు. అమ్మాయిల మనసత్వాన్ని, అబ్బాయిల ఆలోచనా విధానాన్ని వెండి తెరపై ఆవిష్కరించగలిగాడు.
అక్కడక్కడ మాటలు భలే అనిపిస్తాయి. `లావెక్కితే పెళ్లి అవ్వదా` అని అమ్మాయి అలిగితే `పొగరు తలకెక్కితే అవ్వదు` అంటూ తల్లి కౌంటర్ ఇస్తుంది.
`అందం అనేది ఆఫ్ట్రాట్ కంటికి కనిపించే విజువల్ కాదు` అని చెప్పడం బాగుంది.
భానుమతి – రామకృష్ణ మధ్య ప్రేమ పుట్టడం, అది ఒకరిపై ఒకరు చూపించుకోవడం చాలా హుందాగా చూపించాడు. చెల్లెలకు దూరమై రామకృష్ణ బాధ పడుతున్నాడని తెలుసుకుని భానుమతి చేసిన ప్రయత్నం – ఆ తరవాత కారులో భానుమతి – రామకృష్ణ మధ్య ఎమోషన్ – దర్శకుడు చక్కగా చూపించగలిగాడు. సీరియస్ ఎమోషన్ మధ్య ఖుషీ సీన్, అక్కడ హర్ష పేల్చే డైలాగులు `అప్పటి దానివా నువ్వు.. ` అంటూ వయసుని గుర్తు చేయడం – ఇవన్నీ రిలాక్డ్స్ మూమెంట్స్.
ప్రేమకథలో.. కెమిస్ట్రీ కంటే.. కాన్లిఫ్ట్ చాలా ముఖ్యం. ఆ థ్రెడ్ ఈ సినిమాలో చాలా చిన్నదే. మరీ ఎక్కువ మెలో డ్రామాలకు పోకుండా కథని ఎంత సింపుల్ గా మొదలెట్టాడో, అంతే సింపుల్ గా ముగించాడు. పాటలు తక్కువ. నిడివి కూడా తక్కువే. బహుశా థియేటర్‌లో రిలీజ్ చేసుకుంటే 2 గంటల పట్టింపు ఉండేదేమో. ఈ సినిమా మాత్రం గంటన్నరకే పరిమితం అయ్యింది. అందుకే చాలా ఫాస్ట్ గా ముగిసింది. ఇంకాసేపు ఉన్నా బాగుండేది అనే ఫీలింగ్ తెచ్చింది.
నవీన్ చంద్రని ఇలాంటి పాత్రలో ఇప్పటి వరకూ చూళ్లేదు. చిన్న పట్నం నుంచి వచ్చిన ఓ మామూలు కుర్రాడిగా భలే సూటైపోయాడు. తన మేనరిజం, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉన్నాయి. ఎమోషన్స్ బాగా పండించాడు. ఇక భానుమతి గురించి చెప్పాలి. పాత్రకు తగ్గట్టు అమ్మాయి ముదురుగా ఉంది. తను బాగానే చేసినా ఇంకాస్త పర్‌ఫెక్ట్ భానుమతిని ఎంచుకుంటే బాగుండేది అనిపిస్తుంది. నిత్యమీనన్ లాంటి కథానాయిక చేసుంటే – తప్పకుండా `భానుమతి` పాత్రకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయేది. హర్ష.. ఆకట్టుకున్నాడు.
దర్శకుడు చాలా సింపుల్ కథని ఎంచుకున్నా – దాన్ని పర్‌ఫెక్ట్‌గా మలచుకోగిలాడు. చిన్న చిన్న ఎమోషన్స్, మంచి డైలాగ్స్, బిగుతైన కథనం భానుమతి – రామకృష్ణ ని నిలబెట్టాయి. డ్యూయెట్ల జోలికి వెళ్లకుండా, బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్‌కే పరిమితం అవ్వడం ఇంకా బాగుంది. థియేటర్లో వచ్చుంటే కచ్చితంగా మంచి మల్టీప్లెక్స్ సినిమాగా మిగిలేది. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఓటీటీలో వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోతుంటే – భానుమతి – రామకృష్ణ మాత్రం కొంత కాలం నిలబడేలా, చాలామంది మాట్లాడుకునేలా చేస్తుంది.
ఫైనల్ వర్డిక్ట్: సింపుల్ & స్వీట్