రఘురామకృష్ణంరాజుకు వేటు కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి బృందానికి .. లోక్‌సభ స్పీకర్ ఏం చెప్పారో .. ఏం హామీ ఇచ్చి పంపారో కానీ బయట మీడియా దగ్గర మాత్రం చెప్పుకోలేని ప్రశ్నలను ఎదుర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు లాగానే.. సొంత పార్టీని విమర్శిస్తూ.. జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో.. అదే న్యాయం ఎందుకు పాటించడం లేదనే ప్రశ్నలు మీడియా ప్రతినిధుల నుంచి దూసుకొచ్చాయి. దానికి విజయసాయిరెడ్డికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ ఎమ్మెల్యేలు ఎవరూ .. తమ పార్టీలో చేరలేదని కవర్ చేసుకున్నారు. ఆ ఎమ్మెల్యేలకు చెందిన పార్టీ అధ్యక్షుడ్ని అడగాలంటూ.. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మరోసారి అదే ప్రశ్న అడిగితే.. సమాధానం చెప్పడానికి నిరాకరించారు.
తాను చేస్తే రాజకీయం… ఇతరులు చేస్తే మాత్రం నైతిక విలువలకు విరుద్ధమన్నట్లుగా వైసీపీ తీరు ఉందని..విజయసాయిరెడ్డి స్పందనతోనే తేలిపోయిందన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే.. నీతి వాక్యాలు చెప్పే పార్టీగా ప్రస్తుతం వైసీపీ నిలిచింది. అధికారంలో ఉంటే.. తమను ఎవరు ధిక్కరించరని.. వైసీపీ నేతలు అనుకోని ఉండవచ్చు కానీ… రఘురామకృష్ణంరాజు లాంటి నేతలు.. ఉంటారని.. అంచనా వేయలేకపోయింది. ఫలితంగా.. ఏడాది కాక ముందే.. తాము ప్రతిపక్ష పార్టీపై పన్నిన వ్యూహం.. తమకే రివర్స్ అయింది. దాంతో.. అనర్హతా వేటు అంటూ.. వైసీపీ నేతలు ఢిల్లీకి పరుగులు పెట్టారు. ఇలాంటి సమయంలో..తాము చేసిన పనులు కూడా అలాంటివేనన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ పడిపోయింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను .. వివిధ రకాలుగా ఆ పార్టీకి దూరం చేయడమే కాకుండా.. వారితో.. టీడీపీని నానా రకాలుగా విమర్శింప చేస్తూ ఉంటారు వైసీపీ నేతలు. వైసీపీ బ్రాండ్ తిట్లను.. టీడీపీ అధినేతపై కూడా ప్రయోగించేలా చేస్తూంటారన్న విమర్శలు ఉన్నాయి. వారిని తమ పార్టీ గ్రిప్‌లో ఉంచుకుని..కాపాడుతూ.. ఇప్పుడు.. అదే తరహాలో కాకుండా.. కాస్త గౌరవంగా… వ్యాఖ్యలు చేస్తున్న రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం.. వైసీపీ నీతులు చెబుతోంది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే అని.. టీడీపీ నేతలు సెటైర్లు ప్రారంభించారు.