రాజకీయ అనుబంధాలు, న్యాయ పోరాటాలు కొన్నిసార్లు పరస్పర సంబంధం లేకుండా సాగితే తమాషాగా వుంటుంది. ఉదాహరణకు ఢిల్లీలో రామ్‌జెఠ్మలానీ చాలాసార్లు బిజెపితో వున్నారు. అయినా ఆయన ఇతరులకు సంబంధించిన కేసులు వాదించేందుకు వెనుకాడరు. ఈ మధ్యనే నేషనల్ హెరాల్డ్ కేసువాదిస్తానని ఆఫర్ ఇచ్చినా సోనియా గాంధీ స్వీకరించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో వైసీపీ నేత జగన్ తరపున ఒకసారి వచ్చి వాదించివెళ్లారు. కపిల్ సిబాల్ వంటివారికి కూడా ఈ తరహా అనుభవాలున్నాయి.ఇప్పుడు హైదరాబాదులో జంధ్యాల శంకర్ అలాగే రాజకీయ రాజ్యాంగ కేసులకు ఆలంబన అవుతున్నాడని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగానూ అసెంబ్లీ న్యాయసలహాదారుగానూ ఆయన పనిచేశారు. వైఎస్‌రాజశేఖర రెడ్డిని బాగా బలపర్చేవారు. తర్వాత వైసీపీతో వెళ్లలేదు గాని కెవిపి రామచంద్రరావుకు సన్నిహితుడుగా పేరుపొందారు. విభజనానంతర కాలంలో జంధ్యాల శంకర్ రాజకీయాలు తగ్గించి కేసులపైనే కేంద్రీకరిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలలో కొన్ని విజయాలు సాధించారు కూడా. పార్టీల అనుబంధాలతో నిమిత్తం లేకుండా కేసులు చేసి మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకరరావు తదితరుల విలీన లేఖను సవాలు చేస్తూ తెలుగుదేశం తరపున ఆయన వాదిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కేసు నడిపించే(గెలిపించే కూడా!) బాధ్యత తీసుకున్నారు. విడతలు విడతలుగా రాజీనామాలు చేస్తే ఆమోదించకుండా అన్నిటినీ కలిపి మూడింట రెండు వంతులు అని లెక్కిస్తే కుదరదని రేవంత్ వాదన. చట్టరీత్యా ఇది ఒకె గాని కోర్టులు అంత సులభంగా త్వరగా జోక్యం చేసుకోవు. ఈలోగా పుణ్య కాలం గడిచిపోతుంది. కాకుంటే నైతిక స్థయిర్యం నిలబెట్టడానికి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కేసు ఉపయోగపడుతుంది.జంధ్యాల శంకర్ లాగే రామచంద్రరావు, శ్రీరంగారావు, అప్పారిసత్య ప్రసాద్ వంటి వారు ఉమ్మడి హైకోర్టులో ప్రజాసమస్యలు రాజకీయ వ్యవహారాలపై కీలక కేసులలో వాదిస్తుంటారు.