తెలంగాణ సీఎం కేసీఆర్… కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కొత్త ప్రణాళిక రచిస్తున్నారు. దానికి ప్రాతిపదిక.. కొత్త విద్యుత్ చట్టం. రాష్ట్రాల అధీనంలో ఉన్న విద్యుత్ వ్యవస్థలన్నిటినీ గుప్పిట పట్టేందుకు కేంద్రం కొత్త విద్యుత్ చట్టం తీసుకు వచ్చింది. దాన్ని తెలంగాణ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇతర రాష్ట్రాలు కూడా.. అంగీకరించవు. తమిళనాడు.. ఏపీ సహా అనేక రాష్ట్రాలు వ్యతిరేకత తెలిపాయి. ఈ వ్యతిరేకత ఆధారంగానే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరాటానికి రూపకల్పన చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
కేసీఆర్కు విద్యుత్ రంగంపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కరెంట్ కష్టాలు వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ అంతకు ముందు కన్నా పరిస్థితిని మెరుగుపర్చారు. రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు ఉచిత విద్యుత్ అందుబాటులో ఉంది. పరిశ్రమలకు ప్రోత్సాహకంగా సబ్సిడీతో పవర్ సప్లై జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకం కూడా అమల్లో ఉంది. అయితే కేంద్రం కొత్త విద్యుత్ చట్టం తెస్తే తెలంగాణ భారీగా నష్టపోతుందన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. విద్యుత్ సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయి. మరోవైపు కొన్ని వర్గాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ కూడా కోత పడుతుంది. భారీగా చేపట్టిన నీటిపారుదల పథకాలకు పెద్ద ఎత్తున విద్యుత్ అవసరం. ఆ ఖర్చు అంతా.. ప్రభుత్వంపైన పడుతుంది.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది ప్రైవేటు పెట్టుబడిదారులకు విద్యుత్ సంస్థలకు అప్పగించే ప్రయత్నమే అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అన్ని రాష్ట్రాల తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ, పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలను కలుపుకొని కేంద్రంపై గట్టిగా వాయిస్ వినిపించాలని తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. దీనికి కేసీఆర్ నాయకత్వం వహించాలనుకుంటున్నారు.