రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్‌లు వినోద రంగాన్ని ఆక్రమించబోతున్నాయి. సినిమాల్ని మించిన మేకింగ్, కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. వాటి ప్రాధాన్యతని స్టార్లు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే ఈ రంగంలోకి అడుగు పెట్టేశారు. ఇప్పుడు హీరోల వంతు వస్తోంది.
త్వరలోనే రామ్ చరణ్ నిర్మాతగా ఓ వెబ్ సిరీస్ మొదలు కానున్నదని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో చరణ్ సినిమాల్ని నిర్మిస్తున్నాడు. ఖైదీ నెం.150, సైరా, ఆచార్య చిత్రాలకు తనే నిర్మాత. ఇప్పుడు చరణ్ ఓ వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచనల్లో ఉన్నాడని తెలుస్తోంది. భారీ స్టార్లు, సినిమాని మించే బడ్జెట్‌తో.. ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఇది ఆహా కోసమా? మరో ఓటీటీ వేదిక కోసమా? అనేది తెలియాల్సివుంది. ఈమధ్య చిరు కూడా వెబ్ సిరీస్‌లపై ఆసక్తి కరబరిచాడు. మంచి కంటెంట్ ఉంటే, తప్పకుండా నటిస్తానని చెప్పాడు. బహుశా.. చరణ్ ప్లానింగ్ కూడా చిరంజీవి కోసమేనేమో. కొణిదెల ప్రొడక్షన్స్ పెట్టిందే చిరు కోసమని చరణ్ చాలాసార్లు చెప్పాడు. ఆ ప్రొడక్షన్స్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతోందంటే.. చిరు లేకుండా ఎలా? మరి చరణ్ ప్లానింగ్ ఏమిటో? ఈ వెబ్ సిరీస్ స్పెషాలిటీ ఏమిటో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.