ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం తనదైన విశ్లేషణ చేశారు. కొత్త డాక్టర్ కంటే పాత రోగికే ఎక్కువ వైద్యం తెలుసన్నట్లుగా.. అనేక కేసులతో ఉన్న జగన్మోహన్ రెడ్డికి న్యాయవ్యవస్థలోని లొసుగులు బాగా తెలిసిపోయాయని.. అందుకే ఆయన.. ఆ వ్యవస్థపైనే ఎదురుదాడికి దిగుతున్నారని విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు .. న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలతో వారికి నోటీసులు వెళ్లాయి. దాతో ఆయన పద్దతి మార్చుకుని… కుల సంఘాల పేరుతో మాజీ న్యాయమూర్తులను అడ్డం పెట్టుకుని.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని తాజాగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని ఆర్కే ఉదాహరణలతో చెబుతున్నారు.
హైకోర్టు రిజిస్ట్రార్ రాజశేఖర్ మరణానికి చీఫ్ జస్టిస్ కారణం అంటూ.. ఢిల్లీలో ఉండే ఓ కుల సంఘం నేత రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ కుల సంఘానికి మాజీ న్యాయమర్తి ఈశ్వరయ్య గౌడ్ అధ్యక్షుడిగా ఉన్నారట. ఈ ఈశ్వరయ్య గౌడ్ ఎన్నికల ముందు కుల పోరాటాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఏపీ సర్కార్లో మంచి పదవి కూడా లభించింది. ఈయనను అడ్డం పెట్టుకునే న్యాయవ్యవస్థపై జగన్ దాడికి దిగారని తేల్చారు. అలాగే స్పీకర్ పదవికి ఉండే కొన్ని ప్రివిలేజెస్ను అడ్డం పెట్టుకుని… ఆ పదవినీ ఉపయోగించుకుటున్నారని తేల్చారు. ఈ పరిణామాలన్నింటితో… తాను ఏం చేసినా.. చట్టాన్ని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి… ప్రత్యర్థులను చంపినా సరే.. కోర్టులు నోరెత్తకూడదన్న వాతావరణాన్ని జగన్ తీసుకు రావాలని నిర్ణయించుకున్నారని ఆర్కే తేల్చారు.
పనిలో పనిగా.. తెలంగాణ సర్కార్ కూడా.. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని.. అక్కడి ప్రభుత్వమూ అంతే ఉందని కలిపేశారు. అదే సమయంలో.. గత ప్రభుత్వాలు.. న్యాయవ్యవస్థలతో ఎంత సున్నితంగా వ్యవహరించాయో… వివరించారు. ఓ రకంగా చెప్పాలంటే… న్యాయవ్యవస్థతో ఎలా వ్యవహరించాలో.. కొన్ని సలహాలు కూడా ఆర్కే ఇచ్చారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి.. న్యాయవ్యవస్థ చెపితే.. తాను చేసేదేమిటన్నట్లుగా.. వ్యవహరిస్తూండటం వల్లనే సమస్య వస్తోందని తేల్చారు. అమరావతి విషయాన్ని కూడా.. ఆర్కే విభిన్న కోణంలో ఆవిష్కరించారు. వైసీపీ నేతలు ముందుగా చెప్పినట్లుగా.. ఇప్పుడు అది స్మశానం అయిపోయిందన్నారు. పందులు తిరుగుతున్నాయని తేల్చారు. అలా చేసేసి.. ప్రభుత్వ సిబ్బంది కోసం నియమించిన టవర్లన్నింటినీ అమ్మకానికి పెడుతున్నారని.. ఎవరు కొంటారని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ఏం జరిగిందో.. ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని.. అప్పుడు తిరుగుబాటు తప్పదన్న అభిప్రాయాన్ని ఆర్కే వ్యక్తం చేశారు.
ఇప్పుడు న్యాయవ్యవస్థ పై ఏపీ సర్కార్ చేస్తున్న ఎదురుదాడి… తమ నిర్ణయాలకు అడ్డు చెప్పకుండా ఉండాలన్న లక్ష్యంతో చేస్తున్న పనులను.. ఆయన ప్రభావవంతంగానే విశ్లేషించారు.