కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ తప్పు అంతా ప్రైవేటు ల్యాబ్స్ మీద నెట్టేస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో టెస్టులు చేస్తున్న పదహారు ప్రైవేటు ల్యాబుల్లో పదమూడింటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం… టెస్టుల కోసం.. సరైన సౌకర్యాలు కల్పించుకోలేదని.. అదే సమయంలో…పాజిటివ్ రేటు అసాధారణంగా ఉంటోందని..దీనికి కారణం ఏమిటో తేలాలని తెలంగాణ సర్కార్ అంటోంది. గత మూడు, నాలుగు రోజుల నుంచి.. తెలంగాణలో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికం ప్రైవేటు ల్యాబుల్లో జరిపిన టెస్టులే. ప్రైవే టు ల్యాబులన్నీ కలిపి 9,577 టెస్టులు చేసినట్టు ఐసీఎంఆర్ పోర్టల్ లో అప్ లోడ్ చేశాయి. వీటిలో 2,076 పాజిటివ్స్ ఉన్నట్లుగా నిర్ధారించాయి.
అదే సమయంలో…తెలంగాణ స్టేట్ హెల్త్ పోర్టల్‌లో మాత్రం 6,733 టెస్టులు చేసినట్టు చూపించి.. 2,836 పాజిటివ్ వచ్చినట్లుగా రికార్డు చేశారు. ఇది ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. చేస్తున్న పరీక్షలను పూర్తి స్థాయిలో అప్ లోడ్ చేయకపోవడం… అప్ లోడ్ చేసిన టెస్టుల్లో అత్యధికం పాజిటివ్ ఉండటం వల్ల తెలంగాణలో టెస్ట్ పాజిటివ్ రేట్ ఎక్కువగా వస్తోంది. దీని వల్ల హైదరాబాద్ కరోనా వైరస్ తీవ్రంగా ఉందన్న అభిప్రాయం ప్రబలిపోతోందని.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపడుతున్నారు. అయితే.. ఆ టెస్టులన్నీ తప్పు అని చెప్పడం లేదు. కేవలం.. నెగెటివ్ వచ్చిన వాటిని లెక్కలో చూపడం లేదనే అధికారుల ఆగ్రహంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం పదమూడు ల్యాబ్స్‌కు నోటీసులు జారీచేసింది. చాలా ల్యాబుల్లో కనీసం పీపీఏ కిట్లు కూడా వాడటం లేదని.. ప్రభుత్వం అంటోంది. అయితే ఈ వివాదపై ప్రైవేటు ల్యాబ్‌లు.. భిన్నంగా స్పందిస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వారికి త్వరగా రిపోర్టులు ఇవ్వాలని కాబట్టి వేగంగా ఎంట్రీ చేస్తున్నామని.. నెగెటివ్ వచ్చిన వారి వివరాలు మెల్లగా అప్ లోడ్ చేస్తున్నామని అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వ ఆగ్రహం మాత్రం..ప్రైవేటు ల్యాబ్స్‌పై పడటం ఖాయంగా కనిపిస్తోంది.