ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న లెక్క పెట్టలేనంత మంది సలహాదారులు.. డిప్యూటీ సలహాదారుల్లో ఒకరు దేవలపల్లి అమర్. తెలంగాణకు చెందిన ఆయన .. తెలంగాణ ఉద్యమం పేరుతో ఏపీ ప్రజలపై రాయలేని భాషలో విరుచుకుపడిన ఉద్యమకారుడు. ఆయినప్పటికి..ఆయనను ఏపీ సర్కార్ నెత్తి మీద పెట్టుకుంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా సలహాదారు పదవి ఇచ్చింది. నెలకు రూ. మూడున్నర లక్షల జీతంతో పాటుఇతర భత్యాలు ఇస్తోంది. ఆయన హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి ఎలాంటి సలహాలిచ్చారో కూడా తెలియదు. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థించడానికి అప్పుడప్పుడూ జాతీయ మీడియాలోకి వచ్చి… జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. మధ్యలో వెళ్లిపోవడమో.. నీళ్లు నమలడమో చేసి.. హాట్ టాపిక్ అవుతూంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటారు. ఇదే బాగా నచ్చిందేమో కానీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనకు మరో బాధ్యత అప్పగించారు. ఆయన సేవలు వినియోగించుకోవాలని జెన్‌కో కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ .. ఏపీ జెన్‌కోకు నేరుగా ్రజలతో సంబంధం లేదు. అది కేవలం విద్యుత్ ఉత్పత్తి సంస్థ మాత్రమే. జెన్‌కో ఉత్పత్తి చేస్తే.. ట్రాన్స్‌కో అమ్ముతుంది. ఒక వేళ విద్యుత్ రంగానికి సంబంధించిన సలహాలు కావాలనుకుంటే.. ఆ రంగంలోని ఎక్స్‌పర్ట్స్‌ను నియమిస్తారు. కానీ తాను చేయి తిరిగిన జర్నలిస్టునని చెప్పుకునే జర్నలిజంలోనే ఆయన సలహాలు తేలిపోతున్నాయి. అసలు ఓనమాలు కూడా తెలియని విద్యుత్ రంగంలో ఆయన సేవలు ఎలా ఉపయోగపడుతాయన్నది.. ప్రభుత్వానికే తెలియాలి. ఇప్పటికే సలహాదారు పదవిలో ఉన్న ఆయనకు.. చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ జీతం అందుతోంది. ఇప్పుడు జెన్‌కో కూడా.. ఆయన సేవలు పొందాలని ఆదేశాలు అందుకుంది కాబట్టి.. జెన్‌కో నుంచి కూడా.. కొంత మొత్తం అందడం ఖాయమే. అదెంత అనేది.. తర్వాత ఎప్పుడో బయటకు వచ్చే అవకాశం ఉంది.
జెన్‌కో సలహాదారుగా దేవులపల్లి అమర్ సేవలను వినియోగించుకోవాలని చెప్పడం వెనుక.. ప్రభుత్వానికి ఓ లోతైన ఆలోచన ఉందన్న అనుమానాలు విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జెన్‌కో విషయంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్టీపీపీని అమ్మేయడం… చత్తీస్‌ఘడ్‌లో ఉన్న పనికిరాని అథెనా పవర్ ప్లాంట్‌ను కొనుగోలు చేయాలనే నిర్ణయం .. ఇలాంటివి కొన్ని జరిగాయి…ఇవన్నీ ఇబ్బంది లేకుండా ముందుకు సాగాలంటే.. కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలని.. బయట నుంచి ఓ డైరక్టర్‌ను నియమించాలనే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే.. తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా .. అన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తంగా దేవులపల్లి అమర్ సలహాలు.. జెన్‌కో ఎలా ఉపయోగపడతాయో తెలియదు కానీ.. ఆయన మాత్రం… ఏపీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం చేసినా.. ఏపీ ప్రజల సొమ్మును పెద్ద మొత్తంలో జీతంగా పుచ్చుకునే అవకాశం దక్కించుకుంటున్నారు.