కొరకరాని కొయ్యలా మారిన రఘురామకృష్ణంరాజుకు ఏదో ఓ షాక్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. లోక్సభ సభ్యత్వం రద్దు చేయించడం అంత సులువు కాదని వైసీపీ నేతలకు .. లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో భేటీ సందర్భంగా ఓ క్లారిటీ వచ్చి ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఆధారాలు చూపించాలని ఓంబిర్లా ..వైసీపీ ఎంపీలను కోరినట్లుగా చెబుతున్నారు. దాంతో.. వారు అప్పటికప్పుడే వ్యూహం మార్చి.. రఘురామకృష్ణంరాజుకు ఉన్న ” కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్” పదవిని ఊడగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ పదవి నుంచి తొలగించాలని ప్రత్యేకంగా మరో లేఖ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
రాజ్యసభ, లోక్సభలో వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూంటారు. వాటికి చైర్మన్ పదవులు అన్ని పార్టీల వారికి లభిస్తూంటాయి. అలా రఘురామకృష్ణంరాజుకు… కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్” పదవి లభించింది. ఇప్పుడు ఆయన పార్టీని ధిక్కరిస్తున్నారు కాబట్టి.. ఆ పదవి నుంచి ఆయనను తొలగించి.. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఆ పదవి ఇవ్వాలని.. వైసీపీ నేతలు స్పీకర్ వద్ద పట్టుబట్టారు. స్పీకర్ కూడా ఆ విషయాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. లోక్సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎలా ఉన్నా.. కనీసం.. రఘురామకృష్ణంరాజుకు.. ఓ షాక్ ఇవ్వాలంటే.. ఆ పదవి నుంచి అయినా తొలగించాలన్న పట్టుదలను వైసీపీ నేతలు ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్” పదవి.. వైసీపీ వల్ల రాలేదని.. మోడీ ఇచ్చారని రఘురామకృష్ణంరాజు పలుమార్లు ఇప్పటికే బహిరంగంగా చెప్పారు. వైసీపీ వచ్చే అవకాశం ఉన్న పదవిని విజయసాయిరెడ్డికి ఇచ్చారని.. అన్ని పదవులు రెడ్లకే ఇచ్చారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే… రఘురామకృష్ణంరాజుకు పదవిని వైసీపీ సిఫార్సు చేయలేదని.. బీజేపీ పెద్దల సాన్నిహిత్యం వల్లే వచ్చిందని గతంలో ఢిల్లీలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తమ వల్ల రాని పదవిని ఊడగొట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ విషయంలో ఆర్ఆర్ఆర్.. ఎలాంటి కౌంట్ ఇస్తారో చూడాలి…!