ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున అందరికీ ఇళ్ల పట్టాలిచ్చేస్తున్నామని.. కొద్ది రోజుల నుంచి ఉదరగొడుతున్న ప్రభుత్వం.. ఒక్క రోజు ముందు లబ్దిదారులకు షాక్ ఇచ్చింది. పంపిణీని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి కారణం కరోనా అని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం చేయదల్చుకుంటే.. కరోనా.. గిరోనా అడ్డం కాదని.. ఇప్పటి వరకూ చేస్తున్న పనులే నిరూపిస్తున్నాయి. అలాంటప్పుడు.. ఒక్క రోజు ముందు స్థలాల పంపిణీ ఎందుకు నిలిపివేశారన్నది సీక్రెట్‌గా మారింది.
నిజానికి స్థలాల పంపిణీ అనే విషయాన్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేస్తోంది. ఐదారు ముహుర్తాలు పెట్టింది. ఓ సారి స్థలాలు రెడీ కాలేదని..మరోసారి కరోనా అని.. మరోసారి స్థానిక ఎన్నికల వల్ల రమేష్ కుమార్ అడ్డుకున్నారని.. మరోసారి ఏ కారణం చెప్పకుండానే వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్నప్పుడే అందరికీ పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా వల్ల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా వాయిదా వేసుకుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ జయంతికి కంప్లీట్ చేయాలని అనుకున్నారు. అది కూడా.. ఇప్పుడు లెక్కలోకి రాలేదు. ఇక.. ఆగస్టు పదిహేనో తేదీన పంచుతామని చెబుతారన్న ప్రచారం.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది.
నిజానికి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత భూమి ప్రభుత్వం వద్ద లేదు. ప్రైవేటులో కొని.. ప్లాటింగ్ చేశారు. కానీ అంతా చేసినా.. అవి శ్మశానాలు.. అడవులు.. కొండలపై ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఒక ఊరిలో.. మరో ఊరి వారికి స్థలాలు కేటాయించే ప్రయత్నాలు కూడా వివాదాస్పదవుతున్నాయి. అర్హులైన వారికి చాలా మందికి చోటు దక్కలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమస్యలన్నింటీ కారణంగా… ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ అపహాస్యం అవుతోందేమోనన్న అనుమానంతో ప్రభుత్వం వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు.
మరో వైపు.. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కట్టిన ఇళ్లు వృధాగా పడి ఉన్నాయి. వాటి లబ్దిదారులు.. తమకు స్థలాలు వద్దని.. ఆ ఇళ్లనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీటిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఏదో విధంగా అందరికీ ఇళ్ల స్థలాలిచ్చేశామని ఆత్రపడటమే తప్ప.. ఆలోచన లేకపోవడం వల్లే.. ఇలా ఓ పథకాన్ని పదే పదే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని.. వైసీపీ నేతలే గొణుక్కుంటున్నారు.