ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. నాగ అశ్విన్ దర్శకుడు. స్క్రిప్టు పనులు ఎప్పుడో మొదలైపోయాయి. ఈ అక్టోబరులో షూటింగ్ ప్రారంభించాలనుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆ ఆలోచనని పక్కన పెట్టారు. కరోనా- లాక్ డౌన్ ప్రభావంతో షూటింగులన్నీ ఆగిపోయాయి. ఒక వేళ మొదలెట్టినా – ప్రతిక్షణం భయం భయంతో సెట్లో గడపాలి. పైగా.. ప్రభాస్ దృష్టి ఇప్పుడు `రాధే శ్యామ`పైనే ఉంది. అది పూర్తయ్యాకే నాగ అశ్విన్ సినిమా మొదలవుతుంది. 2021 మార్చి – ఏప్రిల్‌లలో నాగ అశ్విన్ సినిమా మొదలయ్యే ఛాన్సుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్ని సైతం పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. 250 కోట్లపై చిలుకు బడ్జెట్ తో ముడి పడి ఉన్న ప్రాజెక్టు ఇది. హడావుడిగా మొదలెట్టడానికి ఛాన్సు లేదు. అందుకే…పరిస్థితులు చక్కబడిన తరవాతే.. ఈ సినిమా గురించి ఆలోచించాలని అశ్వనీదత్, నాగ అశ్విన్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ కూడా…. ఈ ప్రాజెక్టు విషయంలో ఏమాత్రం తొందర పడడం లేదని తెలుస్తోంది. బుర్రా సాయి మాధవ్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన పని పూర్తి చేశారు. సెట్ వర్క్‌కి సంబంధించి చాలా పని ఉంది. ఆగస్టులో సెట్స్ నిర్మాణం మొదలెట్టాలని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆ పనులు కూడా వాయిదా వేశారు.