అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ డబుల్ గేమ్ ఇప్పటికీ జోరుగా నడుస్తోంది. అమరావతి ఉద్యమం ప్రారంభమై రెండు వందల రోజులు అయిన సందర్భంగా.. రాజకీయ పార్టీలన్నీ కొత్తగా సంఘిభావం ప్రకటించాయి. ఇందులో బీజేపీ కూడా కన్నా లక్ష్మినారాయణ ట్వీట్ చేశారు. సుజనా చౌదరి.. వర్చవల్ కాన్ఫరెన్స్‌లో .. రైతులకు మద్దతుగా ప్రసంగించారు. అందులో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని.. అమరావతిని అంగుళం కూడా కదిలించలేరని.. స్పష్టం చేశారు. దీంతో రైతుల్లో కాస్తంత ధైర్యం వచ్చినట్లయింది.
అయితే.. వెంటనే… రెండు రోజులు కాక ముందే… సునీల్ ధియోథర్ రంగంలోకి దిగిపోయారు. ఆయన కూడా అమరావతికి మద్దతు ప్రకటించారు కానీ.. కేంద్రం జోక్యం విషయంలో మాత్రం నాలుక మడతేశారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని… కేంద్రం జోక్యం చేసుకోబోదని ప్రకటించారు. భవిష్యత్‌లోనూ కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు. ఓ వైపు సుజనా వచ్చి.. కేంద్రం జోక్యం చేసుకుటుందని చెబుతారు.. మరో వైపు.. అదే పనిగా.. సునీల్ దియోధర్ వచ్చి జోక్యం చేసుకోదని చెబుతారు. బీజేపీ నేతల ఈ డబుల్ గేమ్… రాజకీయవర్గాలనే కాదు.. అమరావతి రైతులను కూడా నిరాశ పరుస్తోంది.
అమరావతికి మద్దతు ప్రకటించినప్పుడు.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా.. అమరావతి ఎక్కడ ఉన్నది అక్కడే ఉండేలా.. విధాన పరంగా నిర్ణయం తీసుకునేలా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలి కానీ.. ఇక్కడకు వచ్చి రాజకీయ మద్దతు ప్రకటించి.. తరలిస్తే మాత్రం.. అడ్డుకోబోమన్నట్లుగా.. చెప్పడం ఎందుకన్న చర్చ నడుస్తోంది. బీజేపీ అమరావతి విషయంలో డబుల్ గేమ్ ఆడుతోందన్న చర్చ ప్రారంభమయింది. ఇప్పటికే ప్రత్యేకహోదా సహా అనేక అంశాల్లో.. ఏపీని బీజేపీ మోసం చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కాస్త బాధ్యతగా ఉండాలని.. అమరావతి రైతులు కోరుకుంటున్నారు.