తెలంగాణ పాత సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన .. మూడు, నాలుగు రోజుల్లోనే కూల్చివేత ప్రారంభమయింది. మంగళవారం ఉదయం.. పాత సచివాలయానికి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేసిన అధికారులు లోపల కూల్చివేత పనులు ప్రారంభించారు. గతంలోనే.. కూల్చివేత కోసం.. ఇతరులకు పనులు అప్పగించారు. అయితే కోర్టు కేసుల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిన తర్వాత శరవేగంగా.. ప్రభుత్వం స్పందించింది. పాత సచివాలయంలో ఉన్న వాహనాలు.. ఇతర సామాన్లను.. రెండు, మూడు రోజులుగా తరలించారు. ఇప్పుడు కూల్చివేత ప్రారంభించారు.
పాత సచివాలయంలో ఏపీకి కేటాయించిన మూడు భవనాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటిని… తెలంగాణ సర్కార్కు బదలాయించేసింది. దాంతో వాటినీ కూలగొట్టనున్నారు. మొత్తాన్ని కూలగొట్టి.. చదును చేసి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కొత్త భవనం కోసం.. కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. డిజైన్లను కూడా కరారు చేశారు. కాంట్రాక్టర్ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ముందుగా.. కూల్చివేత పనులు వేగంగా పూర్తి చేసి.. తర్వాత అంతే వేగంగా.. కొత్త సచివాలయాన్ని నిర్మించాలని.. ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
పాత సచివాలయం కూల్చివేత విషయంలో… కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత విపక్ష పార్టీలు కొత్త డిమాండ్ ను వినిపిస్తున్నాయి. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని.. రోగులకు అవసరమైన బెడ్లు లేవని… పాత సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలన్న డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా అదే చెప్పారు. కానీ.. ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధపడలేదు. పట్టుదలతో కూల్చివేత ప్రారంభించింది.