కరోనా వల్ల టాలీవుడ్ మొత్తం తలకిందులైంది. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు మూతబడ్డాయి. సినిమాలు రెడీ అయినా.. విడుదల చేసుకోలేని పరిస్థితి. కార్మికులకు ఉపాథి లేకుండా పోయింది. ఇవన్నీ పైన కనిపిస్తున్న కష్టాలు. లోలోపల ఇంకా చాలా సమస్యలున్నాయి.
మార్చిలోనే కరోనా ఉధృతి ఎక్కువైంది. అప్పుడే షూటింగులు ఆపేశారు. కొత్త సినిమాల విడుదలలూ వాయిదా పడ్డాయి. కథలు సిద్ధం చేసుకుని, షూటింగులు మొదలెడదామని భావించిన సినిమాలు.. కొబ్బరి కాయ కొట్టకుండానే ఆగిపోయాయి. అలాంటి సినిమాలు చిన్న, పెద్ద కలిపి కనీసం 25 నుంచి 30 వరకూ ఉంటాయి. షూటింగులుమొదలు కాకపోవడం వల్ల…. వీటికొచ్చిన నష్టమేమీ లేదనుకుంటే పొరపాటే. ఆయా నిర్మాతలంతా నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ అడ్వాన్సులు ఇచ్చేసుకున్నారు. చిన్న సినిమాలైతే ఫర్వాలేదు. మీడియం సైజు, భారీ సినిమాలతే అడ్వాన్సులే కోట్లలో ఉంటాయి. అడ్వాన్సులు ఇచ్చేసిన నిర్మాతలంతా ఇప్పుడు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. షూటింగులు మొదలెట్టలేదు కాబట్టి, ఆ అడ్వాన్సుల్ని తిరిగి తీసుకోవాలా? లేదంటే ఇంకొంత కాలం వేచి చూడాలా? అనేది వాళ్లకు అర్థం కావడం లేదు.
పరిస్థితుల్ని చూస్తే.. మొదలెట్టిన షూటింగులే సవ్యంగా నడవలేని నడవలేని స్థితి. సినిమాల్ని ఎందుకు మొదలెట్టాం రా బాబూ… అంటూ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. అందుకే… ఇంకా మొదలవ్వని సినిమాల్ని, స్క్రిప్టు దశలోనే ఆపేయాలనిచాలామంది నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే… ఇప్పుడు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమని హీరోలు, దర్శకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పరిస్థితులు బాగాలేవని, సినిమాల్ని తీసే స్థితిలో లేమని హీరోలకు కన్వెన్స్చేసుకుంటున్నారు. అయితే.. కొంతమంది మాత్రం బ్యానర్ వాల్యూ ఎక్కడ దెబ్బ తింటుందో అని… అడ్వాన్సులు అడగడానికి మొహమాట పడుతున్నారు. ఒకరిద్దరు నిర్మాతలు ఇప్పటికే ఈ విషయాన్ని నిర్మాతల మండలిలో పంచాయితీ పెట్టినట్టు సమాచారం. ఫలానా హీరోనో, ఫలానా దర్శకుడో.. అడ్వాన్సు తిరిగి ఇవ్వడం లేదని – ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తానికి చాలా సినిమాలు ఇప్పుడు.. స్క్రిప్టు దశలోనే ఆపేయడానికి నిర్మాతలు ఫిక్సయిపోయారు. మరి ఆ కథలకూ, ఆ ప్రాజెక్టులకూ మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి.