30 – 40 మందితో షూటింగులు జరుపుకోండి… అంటూ ప్రభుత్వాలు క్లియరెన్స్ ఇచ్చేసినా – ఒక్క పెద్ద సినిమా కూడా పట్టాలెక్కలేదు. చిన్నా, చితకా సినిమాలు, తక్కువ టీమ్ తో పని కానిచ్చేస్తున్నా, స్టార్లు బయటకు రావడం లేదు. వద్దామన్నా 30 – 40 మందితో షూటింగులు చేసుకోవడం కష్టమని వాళ్లకు అర్థమైపోయింది. పుష్ష కూడా ఈపాటికి సెట్స్‌పైకి వెళ్లిపోవాల్సిందే. కానీ.. ఈ పరిమితుల మధ్య షూటింగ్ చేయలేమని సుకుమార్ అండ్ కో భావించి ఆప్రయత్నాన్ని మానుకున్నారు.
ఇప్పుడు పుష్ష టీమ్ ఓ భారీ స్కెచ్ వేస్తోంది. త్వరలోనే ‘పుష్ష’ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. అయితే 30 – 40 మందితో కాదు.200మందితో. హైదరాబాద్ శివార్లలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి సుకుమార్ టీమ్ సన్నద్ధం అవుతోంది. అక్కడ ఓ రిసార్ట్స్ లాంటిది ఏర్పాటు చేసి, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక రూములు, అదనపు సౌరక్యాలూ కల్పించి – లోపలకి వెళ్లిన వాళ్లు, బయటకు.. బయటకు వచ్చిన వాళ్లు లోపలకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నార్ట. వంటా వార్పు.. కూడా సెట్స్ లోపలే. బయట ఫుడ్ అనుమతించరు. సెట్లో ఉన్నవాళ్లందరికీ కొవిడ్ పరీక్షలు చేసి, వాళ్లలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని నిర్దారించుకున్న తరవాతే టీమ్ లోకి తీసుకుంటార్ట. అయితే ఇంతమందితో షూటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ విషయమే… అధికారుల్ని సంప్రదించి, సోషల్ డిస్టెన్స్ మధ్య షూటింగు ఎలా చేసుకుంటామో వివరించి, పర్మిషన్లు తీసుకోవాలని భావిస్తోంది. అయితే ఇదంతా ఓ ఆలోచన మాత్రమే. ఆచరించడం సాధ్యమా? కాదా అనే విషయాలపై సుకుమార్ టీమ్ రెక్కీ నిర్వహిస్తోందట. సానుకూల ఫలితాలు వస్తాయనుకుంటే, రిస్కు తక్కువ అనుకుంటే.. ప్రభుత్వ అనుమతులతో షూటింగు మొదలెట్టాలని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతందో చూడాలి.