కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. దాంతో విపక్షాలు.. విమర్శలు గుప్పిస్తున్నాయి. అదే సమయంలో .. తెలంగాణలో కరోనా కంట్రోల్ తప్పిందన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో గవర్నర్ తమిళిసై సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అధికారవర్గాలకు కబురు పెట్టారు. చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీని రాజ్‌భవన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ఇద్దరూ ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయంటూ రాలేమని సమాచారం పంపారు. దీంతో సమావేశం జరగలేదు.
అయితే.. ప్రైవేటు ఆస్పత్రులతో మాత్రం తమిళసై వర్చువల్ సమావేశం నిర్వహించారు. కరోనా ఐసోలేషన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ చికిత్స, పడకలు, పరీక్షలు, బిల్లులు, ప్రజల ఫిర్యాదులపై చర్చించారు. కరోనా విషయంలో తాము పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. గవర్నర్ జోక్యం చేసుకోవడానికి కూడా సుముఖంగా లేదు. అందుకే.. పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం వద్దని.. రాజ్‌భవన్ నుంచి సమీక్షల కోసం పిలుపు వచ్చినా.. తాము చెబితేనే వెళ్లాలన్న సందేశం.. ఉన్నతాధికారులకు అందినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ .. గవర్నర్ స్థానంలో ఎవరున్నా.. మంచి సంబంధాలను కోరుకుంటారు.
నరసింహన్ ఉన్నప్పుడు ఆయనను తనదైన శైలిలో మంచి చేసుకున్నారు. అయితే.. తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ వైపు వెళ్లడం తగ్గింది. అదే సమయంలో.. కరోనా విషయంలో తమిళసై యాక్టివ్ గా ఉండటం…సర్కార్ పెద్దలకు నచ్చలేదు. సీఎం కేసీఆర్ ఏ ఆస్పత్రిని సందర్శించకపోయినా.. తమిళిశై మాత్రం.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించారు. అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు.. కేసీఆర్ సైలెంట్ గా ఉండి… గవర్నర్ కరోనా విషయంలో యాక్టివ్ అయితే ఇబ్బందికరమన్న ఉద్దేశంతో… గవర్నర్‌కు సహకరించవద్దని.. సంకేతాలను అధికారులకు పంపుతున్నట్లుగా తెలుస్తోంది.