ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తున్నాం. ఐదేళ్ల తర్వాత అమ్మేసుకోవచ్చంటూ.. ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల స్థలాల లబ్దిదారులను ఊరిస్తున్నారు. అయితే.. అలాంటి అవకాశం లేదని.. చట్టంలో అలాంటి వెసులుబాటు లేదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. మొదటి సారిగా ప్రభుత్వం…. తాము ఇస్తున్న ఇంటి పట్టాలు అమ్ముకోవచ్చన్న వెసులుబాటుతో.. జీవో తీసుకు వచ్చింది. అది నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు ఆ జీవోని కొట్టివేసింది. అయితే.. ఆ తర్వాత ఖాళీ స్థలాలు కాదు.. ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్ముకోవచ్చంటూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఆ ప్రకారమే.. కన్వేయన్స్ డీడ్ లతో.. ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంది. అయితే.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందో లేదో కానీ … అలా.. అమ్ముకునేలా.. ప్రభుత్వం అవకాశం కల్పించడం చట్ట పరంగా సాధ్యం కాదన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలను అసైన్డ్ చట్టం ప్రకారమే ఇవ్వగలుగుతుంది. ఆ చట్టం ప్రకారం.. లబ్దిదారులు.. తాము… తమ వారసులు.. దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ అమ్ముకోవడానికి అవకాశం లేదు. అలా చేతులు మారితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధన ఉంది. దీని కారణంగానే… పెద్ద ఎత్తున అసైన్డ్ ల్యాండ్స్ ను ప్రభుత్వం సమీకరించి.. ఇళ్ల స్థలాలుగా మార్చేసింది. ఇప్పుడు తాము పంచుతున్న ఇళ్ల స్థలాలను అమ్ముకోవచ్చుంటూ.. ప్రభుత్వం లబ్దిదారులను ఆశ పెడుతోంది. జీవో నెంబర్ 44ను హైకోర్టు కొట్టి వేసినప్పుడు… దానిపై స్టే తెచ్చుకున్న తర్వాతనే పంపిణీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అలాందేమీ ప్రభుత్వం తెచ్చుకోలేదు.
ఇప్పటికే కోర్టు ఆదేశాలను పాటించకుండా.. చట్టాలను.. పట్టించుకోకుండా ఏపీ సర్కార్ పాలన సాగిస్తోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో… హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా పట్టాలు పంపిణీ చేస్తే అధికారులు బలయ్యే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే.. డి-పట్టాలు అయితే.. ఇప్పుడే పంపిణీ చేసేవారమని ముఖ్యమత్రి చెప్పారంటున్నారు. అయితే.. ప్రభుత్వం ఇల్లు ఇస్తోంది.. వారికి ఇళ్లు లేదనే అని… అలాంటప్పుడు.. .. వారు అమ్మేసుకుని మళ్లీ ఇల్లు లేని వారుగా మారిపోవడానికి చట్టాలు ఎలా అంగీకరిస్తాయన్న చర్చ జరుగుతోంది. ఎలా చూసినా.. ప్రభుత్వం డి-పట్టాలు మాత్రమే ఇవ్వగలదని న్యాయనిపుణులు అంటున్నారు. రాజకీయంగా టీడీపీపై విమర్శలు చేయవచ్చు కానీ.. ప్రజలకు నిజంగానే… ఆస్తిని ఇవ్వాలనుకుంటే.. దానికి వేరే మార్గాలుంటాయని అంటున్నారు.