సన్సేషనలిజమ్ ఇప్పుడు మీడియా మూల సూత్రమైపోయింది. ఏదో ఒక కాంట్రవర్సీని పట్టుకుని లాగాల్సిందే. మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూలలో. సినీ, రాజకీయ ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అందులో ఒకటో, రెండో కాంట్రవర్సీ క్వశ్చన్లు లేకపోతే.. ఆ ఇంటర్వ్యూకి గుర్తింపు లేకుండా పోతోంది. కొంతమందైతే కేవలం వివాదాల కోసమే ముఖాముఖి పోగ్రామ్స్ పెడుతుంటారు.
యూ ట్యూబ్ ఛానళ్లు వచ్చాక… ఈ గోల మరింత ఎక్కువైంది. నలుగురినీ నిర్మొహమాటంగా తిట్టేవాడినే ఇంటర్వ్యూకి పిలుస్తున్నారు. ఆ తిట్లు.. కట్ చేసి ప్రోమోలు వేసుకుంటున్నారు. దురదృష్టం ఏమిటంటే వాటికే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఇది వరకు జనాల దృష్టంతా రాంగోపాల్ వర్మపై ఉండేది. అందరిపై సెటైర్లు వేయగల సమర్థుడు కాబట్టి… ఆర్జీవీ చాలా ఛానళ్లుకు ఆ విధంగా ఫుడ్డు పెట్టాడు. ఆతరవాత శ్రీరెడ్డిపై ఫోకస్ పడింది. తను ఇంటర్వ్యూకి వస్తే ఎవరినో ఒకరిని ఏకి పాడేసేది. హీరోల బెడ్ రూమ్ విషయాల్ని పూస గుచ్చినట్టు (నిజమో, అబద్ధమో పక్కన పెట్టండి) చెప్పేది. దాంతో వాటికీ బోల్డంత క్రేజ్.
ఇప్పుడు రాకేష్ మాస్టర్ ని పట్టుకుంది వెబ్ ప్రపంచం. చిన్న చిన్న యూ ట్యూబ్ ఛానళ్లన్నీ ఆయనచుట్టూ తిరుగుతున్నాయి. చిరంజీవి దగ్గర్నుంచి చిన్న చిన్న ఆర్టిస్టు వరకూ `వాడూ… వీడూ… లుచ్ఛా.. లఫూట్` అంటూ మాట్లాడేంత తెగువ ఆయనకుంటే దాన్ని క్యాష్ చేసుకునే తెలివి తేటలు ఆయా ఛానళ్లు ప్రదర్శించేవి. రాకేష్ మాస్టారితో ఇంటర్వ్యూ అంటే.. తిట్ల దండకాలు, బూతులే… అని ఫిక్సయిపోయారు జనాలు.
ఇప్పుడు దానికి పీక్స్ చూపించింది ఓ యూ ట్యూబ్ ఛానల్. ఓ యూ ట్యూబ్ ఛానల్ రాకేష్ మాస్టారిని ఇంటర్య్యూ చేసింది. మామూలుగా చేస్తే కిక్ ఏముంటుంది అనుకుందేమో. ఆయన్ని మందులోకి దించి ఇంటర్వ్యూ చేసింది. ఆయన పెగ్గు వేస్తూ బూతులు మాట్లాడితే… కట్ చేసి ప్రోమో వేసుకుంది. చంపేస్తా, నరికేస్తా అంటూ ఇంటర్వ్యూ చేసిన వారిపైనా రాకేష్ మాస్టారు చిందులేయడం ఈ ఇంటర్వ్యూకే హైలెట్. సెక్స్ విషయాలు నిస్సంకోచంగా మాట్లాడడం, బూతుల డోసు ఎక్కువ అవ్వడం, మరీ ముఖ్యంగా కెమెరా ముందే మందు కొట్టడం – నువ్వెంత అంటే నువ్వెంత అంటూ… ఇంటర్వ్యూ ఇచ్చేవాడూ, చేసేవాడూ పోట్లాడుకోవడం ఇవన్నీ న భూతో. న భవిష్యత్ అనుకోవాలి. ఇలాంటి ఇంటర్వ్యూలతో.. ఈ జనానికి ఏం వినోదం పంచి పెట్టాలని? ఏం మంచి చేయాలని? మీడియా ఉద్దేశ్యం.. కాస్తో కూస్తో మంచి చేయడమే. ఇలా.. తప్పు దోవ పట్టించడం కాదు. సెలబ్రెటీ ముసుగులో ఏం మాట్లాడినా చెల్లిపోతుందిలే అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. వాళ్లందరిపై కెమెరా ఫోకస్ చేయడం జర్నలిజం అనిపించుకోదు. ఇలా మందు కొట్టించడం అస్సలు కాదు. భవిష్యత్తులో బెడ్ రూమ్ లో దూరి వాళ్ల శృంగార కార్యకలాపాల్ని కెమెరాలో బంధిస్తూ ఇంటర్వ్యూలు చేస్తారేమో..? అలాంటి దుస్థితి, దుర్గతి.. మీడియాకు పట్టకుండా దేవుడే కాపాడాలి.