కోన వెంకట్ వైకాపా సానుభూతి పరుడు. జగన్ కి ఓ రకంగా భక్తుడు. ఆప్రేమ వైఎస్సార్ నుంచే వచ్చింది. వీలున్నప్పుడల్లా ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు కోన వెంకట్. ఈ రోజు వైఎస్సార్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌తో తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు కోన.
ఓసారి కోన వెంకట్ చైన్నై నుంచి హైదరాబాద్ వస్తుంటే ఫ్లైట్ లో వైఎస్సార్ కనిపించార్ట. కోనని గుర్తు పట్టి.. దగ్గరకు రమ్మన్నార్ట. ‘ఈమధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది. అంటే నీ కెరీర్ బాగుందన్నమాట’ అనే సరికి కోనలో ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం పొంగుకొచ్చాయట. ‘నువ్వు మా ఇంటికి ఓసారి రావాలి. మా మేనల్లుడు ఒకడున్నాడు. తనకు థియేటర్లున్నాయి.. సినిమాలు తీస్తానంటున్నాడు’ అనేసరికి తన దగ్గరున్న కథలు అడుగుతున్నారేమో అని ఇంకాస్త సంబర పడ్డాడట. తప్పకుండా వస్తా సార్.. అని ఆనందంగా చెబితే.. ‘నువ్వు రావాలి.. వాడితో సినిమాలు తీయాలన్న ఆలోచన మాన్పించాలి. నువ్వు కూడా ఓ సినిమా తీసి నష్టపోయావు కదా’ అని అనేసరికి.. కోన గాలి మొత్తం తీసేసినట్టైందట. కోన వెంటక్ నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ‘తోక లేని పిట్ట’. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి కోన జీవితం మొత్తం తల్లకిందులైపోయింది. ఆ సినిమా ఓపెనింగ్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగానే జరిగింది. అదంతా గుర్తు పెట్టుకుని, ఇప్పుడు కోనని పిలిచి – తన మేనల్లుడిని గాడిన పెట్టమని అడిగారన్నమాట. ఈ విషయాన్ని కోన వెంకట్.. తన ఎఫ్ బీలో గుర్తు చేసుకున్నారు.