బ్రిటన్ ప్రధానమంత్రి కూడా కరోనా సోకింది. అయితే ఆయన దాచి పెట్టుకోలేదు. ప్రజల ముందు పెట్టారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు మాత్రం… అందుకు మినహాయింపు అయినట్లుగా ఉంది. తమకు వస్తే ప్రజలు బాధపడతారని అనుకుంటున్నారో… లేకపోతే ప్రజల్లో భయాందోళనలు వస్తాయని అనుకుంటున్నారో కానీ.. సీక్రెట్‌గానే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆ నోటా.. ఈ నోటా బయటకు వస్తూనే ఉన్నాయి. కోస్తాలో ఓ ఎంపీకి… అలాగే రాయలసీమకు చెందిన ఓ డిప్యూటీ సీఎంకు కరోనా సోకిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ విషయాన్ని వారు బయట పెట్టలేదు. ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా.. ఆ డిప్యూటీ సీఎం.. స్వాగత కార్యక్రమంలో కనిపించలేదు. దాంతో.. అందరూ నిజమేనని నిర్ధారణకు రావాల్సిన పరిస్థితి.
ఏపీలో పలువురు రాజకీయ నేతలు.. ఉన్నతాధికారులు కరోనా బారిన పడినట్లుగా కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. ప్రగతి భవన్లో ముఫ్పై మందికి కరోనా సోకడంతో.. కేసీఆర్ ఫార్మ్‌హౌస్‌కు వెళ్లిపోయారని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో.. కేసీఆర్ బయట కనిపించడం మానేశారు. దాంతో ఆయనకూ కరోనా సోకిందంటూ.. కొంత మంది ప్రచారం ప్రారంభించారు. ఓ చిన్న పత్రికలో అదే విషయం ప్రచురించడంతో.. పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. కేసీఆర్‌కు కరోనా సోకలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.
ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో… జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న నేరుగా కోర్టులో పిటిషన్ వేశారు. ప్రగతి భవన్లో 30 మందికి కరోనా సోకిన తర్వాత సీఎం కనిపించడం లేదని.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన ఉందని.. పూర్తి సమాచారం బయటకు చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోతే.. ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతాయి. పుకార్లు పెరిగిపోతాయి. అది.. లేని పోని వివాదాలకు కారణం అవుతుంది. ఏపీలో అయినా.. తెలంగాణలో అయినా.. కరోనా గురించి పూర్తి పారదర్శకత ఉంటేనే.. ప్రజలకు పూర్తి సమాచారం.. క్లారిటీ సమాచారం ఉంటేనే ప్రయోజనం. లేకపోతే.. ఇబ్బందికర పరిణామాలకు కారణం అవుతాయి.