ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. సౌకర్యాలు సరిపోని పరిస్థితి. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం ప్రైవేటు చికిత్సకు అనుమతులు మంజూరు చేసింది. ఆరోగ్యశ్రీ కింద.. కరోనాకు.. చికిత్స చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ పాజిటివ్ కేసులకు, అనుమానితులకు చికిత్స చేసేందుకు ఐసొలేషన్ గదులు, వార్డులు, బ్లాకులు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. చికిత్స ధరల పట్టికను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కరోనా చికిత్స కోసం… ఎదురు చూస్తున్న వేలా మందికి కొత్త ధైర్యం వచ్చినట్లయింది.
కోవిడ్ సోకిన వారికి ఇప్పటి వరకూ.. ప్రభుత్వమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కొన్ని రకాల సేవలు అందిస్తున్నప్పటికీ.. అధికారికంగా కాదు. పైగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాదు. ఇప్పుడు.. అధికారింగా అనుమతులు మంజూరు చేయడం.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చడం వల్ల ప్రజలు ఇకా పైసా ఖర్చు లేకుండా వెళ్లి చికిత్స చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఏపీలో నమోదవుతున్న కేసులకు.. చికిత్స అందించే సౌకర్యాలకు పొంతన లేకుండా పోయింది. అందుకే.. చాలా మందికి హోమ్ ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తున్నారు. లక్షణాలు లేని వారికి.. తక్కువ లక్షణాలు ఉన్న వారికి హోం ఐసోలేషన్ సిఫార్సు చేస్తున్నారు. ప్రత్యేక గది ఉన్న వాళ్లు… ఇంట్లోనే వైద్యులు సూచించిన మందులు వాడి.. చికిత్స పొందుతున్నారు.
పరిస్థితులు విషమించినప్పుడు.. ఏ ఆస్పత్రికి వెళ్లాలన్నది వారికి అర్థం కాని విషయంగా మారింది. పైగా ప్రైవేటు ఆస్పత్రులు దోపిడి మార్గాలుగా మారాయి. చికిత్స కోసం వచ్చిన వారి వద్ద నుంచి లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి… ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి దేశంలో మరే రాష్ట్రంలో.. ఇలా ప్రభుత్వ హెల్త్ స్కీముల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వలేదు. తొలి సారి ఏపీ సర్కార్.. ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. వేల మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరేందుకు అవకాశం ఉంది. కొన్ని వందల కోట్లు ఖర్చు అయినా భరించాలని జగన్ నిర్ణయించారు.