అచ్చెన్న కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని..హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏసీబీ వర్గాల్లో కొత్త కలకలానికి కారణం అవుతున్నాయి. అంతకు ముందు రోజే ఆపరేషన్ జరిగిన ఆయనను ఆరు వందల కిలోమీటర్ల మేర కారులో తీసుకెళ్లారు. దారి పొడవునా ఆయనకు రక్త స్రావం జరిగిందని.. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో ఏసీబీ అధికారులు.. అచ్చెన్నకు ఆపరేషన్ జరిగిందని తమకు తెలియదని.. బుకాయించే ప్రయత్నం చేసినా.. హైకోర్టు ముందు దొరికిపోయారు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని అచ్చెన్న వేసిన పిటిషన్పై జరిగిన విషయంలో.. ఏసీబీ అధికారులు అచ్చెన్న పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో వెలుగులోకి వచ్చింది.
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నప్పుడు అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు.. ఆయన డిశ్చార్జ్ వ్యవహారాలపై.. అధికారులు వేసిన పిల్లిమొగ్గలు మొత్తం హైకోర్టు రికార్డుల్లోకి తీసుకుని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు తెలియచేయాలని చెప్పినా.. ఆ పని చేయలేదు. వీటన్నింటినీ.. హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ముందు ముందు ఈ అంశం.. హైకోర్టులో కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. అచ్చెన్న విషయంలో ఏసీబీ పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని.. ప్రాథమిక విచారణ లేకుండా అరెస్ట్ చేయడమే కాదు.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని… టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణలో ఓ కేసు విషయంలో… ఓ నిందితుడితో.. రోజంతా.. బారికేడ్లు తోసే పని చేయించిన పోలీసులపై అక్కడి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అది మానవ హక్కుల ఉల్లంఘనగానే పేర్కొని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం తీసుకోలేదు. దాంతో.. ఆలస్యం ఎందుకని.. నిన్న మరోసారి ప్రశ్నించింది. ఇప్పుడు… అచ్చెన్న కేసులోనూ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లుగా.. కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడంతో.. ఏసీబీ దర్యాప్తు అధికారికి చిక్కులు తప్పవన్న అభిప్రాయం న్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది.