రఘురామకృష్ణంరాజు తమను పందులతో పోల్చారంటూ.. వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ముందుగా మంత్రి శ్రీరంగనాథరాజు .. తన పీఏతో.. పోడూరు అనే మండల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఎంపీ అసభ్యంగా మాట్లాడారని చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే.. పోలీసులు మాత్రం… కోర్టులో తేల్చుకోవాలని చెప్పి పంపారని ప్రచారం జరిగింది. తాజాగా.. బీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇలా.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జాబితాలో చేరారు. రఘురామకృష్ణంరాజు వైసీపీలో వర్గ విబేధాలు రెచ్చగొట్టేలా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ… ఫిర్యాదు చేశారు. ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా వరుస పెట్టి పోలీస్ స్టేషన్లకు.. వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు పంపుతూండటంతో.. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు మొదట్లో తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ మార్క్ భాషతో పాటు.. దిష్టిబొమ్మలు దహనం చేయించారు. ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు అదే పనిగా పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఆ కారణంగానే ఆయన… తనకు కేంద్ర భద్రత కావాలంటూ… స్పీకర్‌కు లేఖ రాశారు. దానిపై నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఈ తరుణలో రఘురామకృష్ణంరాజుపై రివర్స్ కేసుల అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తారా లేదా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నేతలు వాడే భాషతో పోలిస్తే.. రఘురామకృష్ణంరాజు భాష చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఇలాంటి భాషను కూడా వాడవచ్చా.. అని ఆశ్చర్యపోయేలా.. బూతులతో విరుచుకుపడటం వైసీపీ నేతల స్టైల్. అలాంటిది.. తమను అసభ్యంగా తిట్టారంటూ… ఎంపీపైన కేసులు నమోదు చేయాలని అదే పనిగా ఫిర్యాదులు చేయడం… అందర్నీ ఆశ్చర్య పరిచేదే. దీనిపై రఘురామకృష్ణంరాజు ఎలా స్పందిస్తారో కానీ… నర్సాపురం వైసీపీ రాజకీయ పంచాయతీ మాత్రం.. రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది.