లాక్ డౌన్కి ముందు, థియేటర్లు మూసివేయడానికి ఓ వారం ముందు విడుదలైన సినిమా ‘పిట్టకథ’. మంచి పబ్లిసిటీతో విడుదలైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు దగ్గర ఏ రకమైన ప్రభావాన్నీ చూపించలేకపోయింది. కరోనా భయాలతో – జనం థియేటర్లకు వెళ్లడం మానివేయడం వల్లో, సినిమాలో సరుకు లేకపోవడం వల్లో.. టికెట్లు తెగలేదు. థియేటర్ దగ్గర డిజాస్టర్ ఈ సినిమా.
అయితేనేం.. ఓటీటీ వేదికపై ఇరగాడేసింది. థియేటర్ నుంచి తీసేసిన రెండు వారాలకే ఈ సినిమా ఆమేజాన్ లో ప్రత్యక్షమైంది. ఈ సినిమాని మీడియేటర్ 75 లక్షలకు కొనుక్కుని అమేజాన్కి పే ఫర్ వ్యూ పద్ధతిలో ఇచ్చేశాడు. వ్యూకి పది రూపాయల చెప్పున అమేజాన్ లెక్కగడితే… ఈ సినిమాకి ఇప్పటి వరకూ 4 కోట్ల వరకూ రెవిన్యూ వచ్చిందని సమాచారం. సినిమా బడ్జెట్ 1.25 కోట్లయితే… ఆ లెక్కన భారీ లాభాలు వచ్చినట్టే. కానీ ఇవేం నిర్మాతకు రావు. ఆయన ఆల్రెడీ ఈసినిమాని 75 లక్షలకు ఇచ్చేశాడు కాబట్టి.. అమేజాన్లో హిట్టయినా, ఆ లాభాలు అందుకోలేకపోయాడు. కానీ మీడియేటర్ తో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం.. ‘ఓ పిట్ట కథ’ డిజిటల్ రైట్స్ నిర్మాత దగ్గరే ఉన్నాయి. ఆహక్కుల్ని మీడియేటర్ మరో కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడట. ఆ రూపంలో చూస్తే.. సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత లాభాలతో గట్టెక్కాడు. అసలు ఈ సినిమా మేకింగ్ తో సంబంధం లేని మీడియేటర్ నిర్మాత కంటే ఎక్కువ లాభాల్ని ఆర్జించగలిగాడు. అదీ.. పిట్ట కథ వెనుకున్న పెద్ద స్టోరీ.