సినిమా అవకాశాల కోసం ఎదురు చూసే అమాయకులను టార్గెట్ చేస్తూ, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల అజయ్ భూపతి పేరు వాడుకుంటూ.. తనలా అమ్మాయిలతో మాట్లాడుతూ, వాళ్లని లోబరుచుకోవాలని చూస్తున్న ఓ ముఠాపై పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే మరో ఉదంతం ఇది.
గీతా ఆర్ట్స్ పేరు చెప్పి, ఓ వ్యక్తి అమ్మాయిలను ట్రాప్‌లోకి లాగుతూ, వాళ్లని మోసం చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. తాను గీతా ఆర్ట్స్ లో పని చేస్తానని, బన్నీ తదుపరి సినిమాలో కథానాయికగా అవకాశం ఇస్తానని చాలామంది అమ్మాయిలకు మభ్యపెట్టి, వాళ్లని మోసం చేస్తున్నాడు. నకిలీ పేర్లతో అమ్మాయిలతో వాట్సప్‌లో చాటించ్ చేస్తూ, మోసానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం గీతా ఆర్ట్స్ వరకూ వెళ్లింది. దాంతో యాజమాన్యం ఎలర్ట్ అయ్యింది. ఓ ప్రబుద్ధుడు తమ పేరు వాడుకుంటున్నాడని గీతా ఆర్ట్స్ మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్రీసీమలో ఇలాంటి చీటింగ్ కేసులు మరీ ఎక్కువైపోతున్నాయి. తానో దర్శకుడిని అనో, నిర్మాతని అనో ఆశావాదులకు వల వేస్తున్నారు. ఇలాంటి వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.